సీఏఏపై సూపర్‌స్టార్‌ రజనీ సంచలన వ్యాఖ్యలు..

By అంజి  Published on  5 Feb 2020 10:03 AM GMT
సీఏఏపై సూపర్‌స్టార్‌ రజనీ సంచలన వ్యాఖ్యలు..

చెన్నై: కేంద్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. తాజాగా సీఏఏ, ఎన్‌పీఆర్‌పై తమిళ హీరో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. సీఏఏకు రజనీకాంత్‌ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఏఏ వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ముప్పులేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ముస్లింలకు నిజంగానే అన్యాయం జరగితే తాను ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు.

సీఏఏపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక అవగహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది, దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌లో ఉన్న ముస్లింలను ఎక్కడికి పంపరని రజినీ అన్నారు. అయితే కొన్ని పార్టీలు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నాయని రజనీ వ్యాఖ్యనించారు. ఇక బయటి వ్యక్తులను గుర్తించేందుకే ఎన్‌పీఆర్‌ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని రజనీ చెప్పారు. సీఏఏపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసిందని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై రజనీకాంత్‌ మొట్టమొదటిసారిగా స్పందించారు.

ఇదిలా ఉంటే రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే రజనీకాంత్ చదివారని కాంగ్రెస్ సీనియర్‌ నేత కార్తీ చిదంబరం అన్నారు. ఇక నేరుగా ఆయన బీజేపీలో చేరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

మంగళవారం నాడు ఎన్‌ఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకోలేదని మంగళవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా కేంద్రహోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమాధానం చెప్పారు.

Next Story