'మోక్షజ్ఞ' గురించి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
By Newsmeter.Network Published on 21 Dec 2019 6:30 AM GMT
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వలో రూపొందిన ఈ సినిమాని సి.కళ్యాణ్ నిర్మించారు. ఈ నెల 20న రూలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే... బాలయ్య 100 సినిమాలు పూర్తి చేసినప్పటికీ ఇంకా యంగ్ హీరో వలే వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. అభిమానులు అందరిలో ఒకేటే ప్రశ్న.
బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం ఎప్పుడు..? అని. తెర పై యువ బాలకిషోరాన్ని ఎప్పుడు చూస్తామా అని గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చేస్తున్నాడు.. వచ్చే సంవత్సరం వచ్చేస్తున్నాడు అని టాక్ వినిపించడమే కానీ.. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే.. అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఫోటోలు బయటకు రావడం.. ఆ ఫోటోల్లో మోక్షజ్ఞ హీరో లుక్ లో కాకుండా సాధారణ యువకుడుగా మామూలుగా ఉండడంతో అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..? అనే సందేహం ఏర్పడింది.
దీని పై బాలయ్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారా..? అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి బాలయ్య రూలర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ బాలయ్య ఏమన్నారంటే.. మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం గురించి చాలా మంది అడుగుతున్నారు. తప్పకుండా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు. కథల గురించి నాతో చర్చిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. కాకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలతో తెలియచేస్తాను అన్నారు బాలయ్య. సో.. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం ఖాయం.