హేమంత్‌ హత్యకు నెల క్రితమే ప్లాన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2020 10:31 AM GMT
హేమంత్‌ హత్యకు నెల క్రితమే ప్లాన్‌

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యకేసులో నిజాలు బయటకు వస్తున్నాయి. హేమంత్‌కు హత్యకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఎలా ప్రణాళిక రచించాడు..? రెక్కి ఎలా చేశారు..? తదితర విషయాలను పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. హేమంత్‌ను చంపేందుకు నెల రోజుల ముందే ప్లాన్ సిద్ధం చేశారు నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం వుంటున్న హేమంత్, అవంతిల కిడ్నాప్, మర్డర్‌కు సంబంధించి యుగంధర్ రెడ్డి రెక్కీ నిర్వహించి ప్లాన్ సిద్ధం చేశాడు. అలాగే అవంతిని ఎలా అయినా తమవైపు తిప్పుకోవాలని లక్ష్మారెడ్డి ప్లాన్ చేశారు. హేమంత్ మర్డర్‌కు సంబంధించి నెల కిందటే లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో మీటింగ్ నిర్వహించారు.

జూన్ 11న హేమంత్‌ను అవంతి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు అవంతి తల్లిదండ్రులు అవమానంతో ఇల్లు దాటి బయటకు రాలేదు. లక్ష్మారెడ్డి భార్య అర్చన సోదరుడు యుగేందర్‌రెడ్డి వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. అక్క బాధను చూడలేక.. హేమంత్‌, అవంతిని విడదీయాలని యుగేందర్‌ రెడ్డి నిర్ణయించుకున్నాడు. హేమంత్‌ను చంపేందుకు కిరాయి హంతకులు కృష్ణా, రాజు, పాషాలతో యుగంధర్‌ పలుమార్లు చర్చలు జరిపారు. ఈలోపు అవంతికి మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. ఈనెల 24న మధ్యాహ్నం 2.30గంటల సమయంలో హేమంత్‌ ఇంట్లోకి 12 మంది బందువులు హేమంత్‌, అవంతిలపై దాడి చేస్తూ లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇద్దరికిన కారులోకి బలవంతంగా ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుకుందామని చెప్పి బోపన్‌పల్లి వైపు తీసుకెళ్లారు. అయితే.. మార్గమధ్యంలో అవంతి, హేమంత్‌ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా.. హేమంత్‌ మాత్రం వారికి దొరికిపోయాడు. అదే రోజు రాత్రి 7.30గంటల సమయంలో నిందితులు కారులోనే హేమంత్‌ను చంపేశారు. నిందితులు లక్ష్మారెడ్డి, అర్చన మాత్రం సీన్‌లో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

హేమంత్‌ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. బ్రిటన్‌లో ఉంటున్న అతని సోదరుడు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు. హేమంత్‌ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story