హైదరాబాద్‌: పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్‌

By సుభాష్  Published on  25 Sep 2020 6:46 AM GMT
హైదరాబాద్‌: పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లో పరువు హత్య సంచలనం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట మీద యువతి తండ్రి యువకుడిని అతి దారుణంగా హత్య చేయించాడు. సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివార్లలో హేమంత్‌ మృతదేహం లభ్యం కాగా, శవం దొరికి ప్రాంతంలోనే సంగారెడ్డి క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే ప్రేమ వివాహం నచ్చని యువతి తండ్రి లక్ష్మారెడ్డి బంధువులు, కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్‌ చేసి సంగారెడ్డిలో హత్య చేయించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 13 మందిని అరెస్ట్‌ చేశారు.

కాగా, నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో హేమంత్‌, భార్య అవంతిలను దుండగులు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. హేమంత్‌ తండ్రి 100 డయల్‌కు సమాచారం అందించాడని, అలాగే హేమంత్‌ భార్య అవంతి సాయంత్రం 6 గంటలకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హేమంత్‌ హత్య కేసులో అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో పాటు ఇతర బంధువులు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Next Story
Share it