హైదరాబాద్‌: కలకలం రేపుతున్న పరువు హత్య

By సుభాష్  Published on  25 Sep 2020 4:20 AM GMT
హైదరాబాద్‌: కలకలం రేపుతున్న పరువు హత్య

హైదరాబాద్‌లో పరువు హత్య కేసు కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట మీద యువతి తండ్రి యువకుడిని అతి దారుణంగా హత్య చేయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రేమ వివాహం నచ్చని యువతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్‌ చేసి సంగారెడ్డిలో హత్య చేయించాడు.

కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ యువజంట తండ్రికి భయపడి చందానగర్‌ నుంచి వచ్చి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్‌ చేయగా, యువతి పారిపోయి 100 డయల్‌కు సమాచారం అందించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించడంతో అక్కడే హత్య కేసు నమోదు చేశారు. హేమంత్ హత్య విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. కాగా, సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివార్లలో హేమంత్‌ మృతదేహం లభ్యం కాగా, శవం దొరికి ప్రాంతంలోనే సంగారెడ్డి క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హేమంత్‌ కనిపించకుండాపోవడంతో అతనిపై గచ్చిబౌలి పీఎస్‌లోనే కిడ్నాప్‌ కేసు నమోదు కూడా అయ్యింది. కాగా, ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Next Story
Share it