అవును.. ఆయన జార్ఖండ్‌కు కాబోయే ముఖ్యమంత్రే..!
By న్యూస్‌మీటర్ తెలుగు
నిన్న వెలువడిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలలో గెలిచి విజయపతాకం ఎగురవేసిన జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో జేఎంఎం సొంతంగా 30 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16, జేవీఎం (పీ) 3, ఏజేఎస్‌యూ 2, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 41 సీట్ల సంఖ్యను సునాయాసంగా దాటేసిన జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి సాధించింది.
ఈ నేఫథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని జేఎంఎం వర్గాల నుండి సమాచారం. ఇదిలావుంటే.. నేడో రేపో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న హేమంత్ సోరెన్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
హేమంత్ తన సతీమణి కల్పన సోరెన్.. తన సోదరి అంజలితో కలిసి వంటగదిలో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేఫథ్యంలో రాంచీలోని హేమంత్ నివాసంలో హడావుడి నెలకొంది. ఎన్నికల ఫలితాలను ప్రసార మాధ్యమాలలో హేమంత్ తండ్రి శిబు సోరెన్, తల్లి రీపు ఇతర కుటుంబ సభ్యులు వీక్షించారు. ఎన్నికలలో కూటమి గెలుపొందటంతో పండుగ వాతావరణం నెలకొంది. ఆ సంబరాలకు సంబంధించి ఈ ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.