జయ రూ.913 కోట్లకు వారసులు వాళ్లే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 10:05 AM GMT
జయ రూ.913 కోట్లకు వారసులు వాళ్లే

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఎవరికి చెందుతాయనే విషయంలో ఉత్కంఠకు తెరపడింది. జయ ఆస్తులన్నీ ప్రభుత్వం, లేదా అన్నాడీఎంకే పార్టీ పరం కాబోవని తేలిపోయింది. జయకు భర్త, సంతానం లేకపోయినా.. ఆమె రక్త సంబంధీకులకే ఆస్తులు చెందనున్నాయి. జయకు సంబంధించిన రూ.913 కోట్ల ఆస్తులకు ఆమె మేనల్లుడు దీపక్‌, మేనకోడలు దీప వారసులు కాబోతున్నారు. జయలలిత సోదరుడి సంతానమైన వీళ్లిద్దరినీ ఆమెకు ద్వితీయ శ్రేణి వారసులుగా మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. జయ బతికున్నంత కాలం కుటుంబ సభ్యుల్ని పెద్దగా దగ్గరికి తీసుకోలేదు. స్నేహితురాలు శశికళతోనే సన్నిహితంగా ఉంది. ఐతే ఆమె మరణానంతరం మేనకోడలు దీప.. తానే జయకు వారసురాలినని.. ఆమె ఆస్తులు తనకే చెందాలని పోరాడుతోంది. ఎట్టకేలకు ఆమె పోరాటం ఫలించింది.

మరోవైపు చెన్నై పొయెస్ గార్డెన్‌లోని జయలలిత ఎంతో విలాసవంతంగా కట్టుకున్న ఇంటిని (వేద నిలయం) స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకూ బ్రేక్ పడ్డట్లే. దీనికి వ్యతిరేకంగా దీప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జయలలితకు సంబంధించి కొన్ని ఆస్తులను కేటాయించి ఆమె పేరుతో ఓ చారిటీ ట్రస్టును ఏర్పాటు చేసి దాని బాధ్యతలను కూడా దీప, దీపక్‌లకు అప్పగించాలని.. దీనిపై ఎనిమిది వారాల్లోగా తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

New Project (1)

జయలలిత ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక ట్రస్టీలను నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. మొత్తానికి జయ బతికుండగా ఆమె ఆదరణకు నోచుకోలేకపోయినప్పటికీ.. ఆమె మరణానంతరం ఏకంగా 913 కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు కాబోతుండటంతో దీప, దీపక్ జాక్ పాట్ కొట్టినట్లే.

Next Story
Share it