గుండెపోటు ఎందుకు వస్తుంది..!
By సుభాష్ Published on 5 Oct 2020 5:40 AM GMTప్రస్తుత కాలంలో చాలా మంది గుండె వ్యాధుల బారిన పడేవారు ఎక్కువైపోయారు. గుండెపోటు కేసులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఒకప్పుడు దాదాపు 50 నుంచి 60 ఏళ్లు దాటిని వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేవిది. ఇప్పుడున్న కాలంలో 30 ఏళ్లలోనే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరుతున్నాయి. గుండె అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. గుండె పనితీరు సజావుగా ఉంటేనే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. గుండె పనితీరు సరిగ్గా లేదంటే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. రక్తాన్ని శుద్ది చేసి శరీరంలోని ప్రతి విభాగానికి అక్షిజెనెటేడ్ రక్తాన్ని ఆర్టెరీస్ ద్వారా సరఫరా చేయడంలో గుండె ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని వ్యాధుల వల్ల లేదా కొన్ని గాయాల వల్ల గుండె సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని ఇతర అవయవాలకు రక్త సరఫరా ఆటంకం ఏర్పడవచ్చు. తద్వారా వాటి పనితీరు కూడా దెబ్బ తింటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రోజువారీ ఒత్తిళ్లు, ఆందోళన తదితర సమస్యల వల్ల గుండె వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
గుండెపోటు ఎందుకు వస్తుంది..?
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల రక్త ధమనులలో కొలెస్టాల్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో కొలెస్టాల్ స్థాయి పెరిగినప్పుడు, రక్త రవాణా ప్రభావితమవుతుంది. ఇక అధిక కొలెస్టాల్ కారణంగా గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు తగ్గిపోతుంటే, గుండె ఒత్తిడి చెందడం ప్రారంభించి చివరికి వ్యాధిగా మారుతుంది. ఇప్పుడున్న కాలానుగుణంగా గుండెపోటుచిన్న వయసులోనూ వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఛాతీ, చేతులు, దవడ, భుజం, మెడలో నొప్పిని వంటివి తలెత్తుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, కడుపు నొప్పి, చెమట, అధిక అలసట, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే గుండెపోటు వస్తుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కో సమయంలో గుండె పట్టేసినట్లు, ఆయాసం, గుండెలో నొప్పి అనిపించడం వంటివి ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా జరగవచ్చు. ఛాతీలో నొప్పి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు..
సాధారణంగా ఛాతీలో నొప్పి కూడా చాలా మందికి వస్తుంటుంది. అలా నొప్పి అనిపించిన సమయంలో గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ పరీక్షలో గుండె కొట్టుకునే తీరు గుర్తించవచ్చు. అనేక కారణాలతో ఈ రోజుల్లో ఛాతీలో నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి భయాందోళన చెందకుండా వైద్యుడిని సంప్రదిస్తే నొప్పి నుంచి దూరం కావచ్చని చెబుతున్నారు.
గుండెపోటు రాకుండా ఉండాలంటే..
కాగా, ప్రస్తుతం ఉన్న రోజుల్లో గుండెపోటు చాలా మందికి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు రాకుండా మన ఇంట్లోనే అనేక ఔషధాలు ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంట్లో ఉండే వెల్లుల్లి, అల్లం, నిమ్మ, ఆపిల్ వెనుఇగర్, తేనె వంటివి ప్రతి రోజు తీసుకునేలా మెనూ సిద్ధం చేసుకోవాలి. పరగడుపున నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
మరి కొన్ని జాగ్రత్తలు..
► ఉదయం సమయంలో కనీసం అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి
► తినే పదార్థాలలో ఉప్పును తగ్గించాలి
► ప్రతి రోజు కనీసం ఐదు రకాల పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి
► ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవద్దు
► ధూమపానం అలవాటును మానుకోవాలి
► కొవ్వు పదార్థాలను తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
► లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బిపి పరీక్షలను క్రమంగా చేయించుకోవాలి
► శరీరం బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి
► కనీసం సంవత్సరానికోసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలి
► డయాబెటిస్ ఉన్నట్లయితే కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి