పెరుగుతున్న వైరల్‌ జ్వరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వర్షాకాలం, మారిన వాతావరణం పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ల కేసులు విపరీతంగా పెరిగాయి.

By అంజి
Published on : 2 Sept 2025 10:19 AM IST

Viral fevers, precautions, Health Tips

పెరుగుతున్న వైరల్‌ జ్వరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వర్షాకాలం, మారిన వాతావరణం పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ల కేసులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు. గాలి, నీరు, దోమల వల్ల ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. వర్షాకాలంలో గాలి ద్వారా జలుబు, ఇన్ఫ్లూయెంజా, వైరల్‌ ప్లూ వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. నీరు కలుషితం అవ్వడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్‌ ఇన్ఫెక్షన్లు మన శరీరంలోని శ్వాసకోశ, పేగు, గుండె, నాడీ వ్యవస్థ వంటి ఏదైనా అవయవ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే వైరల్‌ ఇన్ఫెక్షన్‌ జ్వరం.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ సూచించిన మందులనే వాడాలి. పిల్లలకు సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లో వద్దు. కనీసం 8 గంటల నుంచి 9 గంటల నిద్ర ఉండాలి. జ్వరం వల్ల వేడిగా మారిన శరీర ఉస్ణోగ్రతను తగ్గించడానికి గోరు వెచ్చని నీటిలో ముంచిన వస్త్రాన్ని నుదిటిపై ఉంచాలి. వీలైనంత ఎక్కువగా గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. కెఫిన్‌ ఉన్న పానీయాలు, సోడా, కూల్‌డ్రింక్స్‌, ఆల్కహాల్‌ తీసుకోకూడదు.

జ్వరంతో బాధపడే వ్యక్తి బట్టలు, రుమాలు, తువ్వాలు, ఇతర వ్యక్తిగత వస్తువులను ఇతరులు వాడకపోవడం మంచిది. దీని వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. మీ ముక్కు, నోటిని తరచుగా తాకవద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు లేదా చేతిని అడ్డంగా ఉంచుకోవాలి. సిట్రస్‌ పండ్లు, బెర్రీలు, బ్రకోలీ వంటి విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలు, ఆకు కూరలను తీసుకోవాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు

వైరల్‌ ఫీవర్‌ సోకిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 99 ఫారన్‌ హీట్‌ నుంచి 103 ఫారన్‌ హీట్‌ వరకు ఉంటుంది. చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసంగా ఉండటం, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారంగా ఉండటం, మైకం, కళ్లు ఎర్రబడటం, స్కిన్‌పై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లి వైద్యుని సూచనలు పాటించాలి.

Next Story