భారత్‌లోని పురుషుల్లో తగ్గిపోతున్న వీర్యకణాల శాతం: అధ్యయనం
The Number Of Sperm Cells In Men Is Decreasing In India. పురుషుల్లో వీర్యకణాల శాతం తగ్గిపోతోంది. భారత్‌తో సహా ప్రపంచమంతటా ఇదే సమస్య నెలకొంది. వీర్యకణాలు
By అంజి
పురుషుల్లో వీర్యకణాల శాతం తగ్గిపోతోంది. భారత్‌తో సహా ప్రపంచమంతటా ఇదే సమస్య నెలకొంది. వీర్యకణాలు పునరుత్పత్తికి సంబంధించిన సూచిక మాత్రమే కాదని, ఇది తీవ్రమైన వ్యాధులకు సూచికగా కనబడుతోందని పరిశోధకులు అంటున్నారు. దీన్ని పురుషుల ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడంతో మానవాళి మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజా అధ్యయనంలో పురుషుల స్పెర్మ్ కౌంట్ డౌన్ అవుతోందని తేలింది.
స్మెర్మ్ కౌంట్ తగ్గితే దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్‌తో పాటు జీవితకాలం తగ్గిపోవడానికి అదొక సూచిక అని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక పర్యావరణం, జీవన విధానాల్లో వచ్చిన మార్పుల వల్లే ఇలా జరుగుతోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీర్యకణాల సంఖ్య తగ్గడం అనేది.. ప్రపంచ సంక్షోభానికి ఒక సంకేతం మాత్రమేనని అంటున్నారు. ఇది మానవజాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. స్పెర్మ్ కౌంట్‌పై పలు యూనివర్సిటీలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించాయి.
భారత్‌తో పాటు 53 దేశాల డేటాను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. 2000 సంవత్సరం నుంచి క్రమంగా వీర్యకణాల సంఖ్య పడిపోతూ వస్తోంది. భారత్‌లోనైతే ఇది తీవ్ర స్థాయిలో ఉందని, నిరంతరంగా స్పెర్మ్ కౌంట్ సంఖ్య తగ్గడం నమోదైందని జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ చెప్పారు. భారత్‌లో డాటా అందుబాటులో ఉందని, మిగతా దేశాల్లో డాటా తక్కువగా ఉందని చెప్పిన ఆయన.. పరిస్థితి ఇందుకు భిన్నంగా మాత్రం ఏమీ లేదన్నారు. గడిచిన 46 సంవత్సరాల్లో వీర్యకణాల శాతం 50 శాతం తగ్గిపోయిందని, ఈ మధ్య కాలంలో అది మరింత వేగవంతంగా మారిందని చెప్పారు.
అయితే క్షీణతకు కారణాలు ఎంటన్న దానిపై ఈ అధ్యయనం ప్రత్యేక దృష్టి పెట్టలేదు. జీవన విధానాల్లో వచ్చిన మార్పులు, పర్యావరణంలో కెమికల్స్ పెరుగుదల ప్రభావం చూపిస్తున్నాయని లెవిల్ అభిప్రాయపడ్డారు. తల్లిగర్భంలో ఉన్న సమయంలోనే శిశువులో పునరుత్పత్తి అంగాల అభివృద్ధిలో లోపం ఏర్పడుతుండొచ్చని లెవిన్ తెలిపారు. స్పెర్మ్ కౌంట్ తగ్గడమనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచిక కావచ్చని అన్నారు. ప్రపంచ దేశాలు తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని లెవిన్ కోరారు.