మంకీపాక్స్ భ‌యం.. మ‌శూచి వ్యాక్సిన్‌కు పెరిగిన డిమాండ్

Sudden demand for Smallpox vaccine in fight against Monkeypox.క‌రోనా వైర‌స్ ఇంకా పూర్తిగా క‌నుమ‌రుగు కాక‌ముందే ప్ర‌పంచ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2022 3:39 AM GMT
మంకీపాక్స్ భ‌యం.. మ‌శూచి వ్యాక్సిన్‌కు పెరిగిన డిమాండ్

క‌రోనా వైర‌స్ ఇంకా పూర్తిగా క‌నుమ‌రుగు కాక‌ముందే ప్ర‌పంచ దేశాల‌ను మంకీపాక్స్ భ‌యం వెంటాడుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క్ర‌మంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండ‌డం ఆందోళన క‌లిగిస్తోంది. గ‌త వారం రోజుల్లో భారత్‌లో నాలుగు మంకీపాక్స్ కేసులు న‌మోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంకీపాక్స్ అనుమానిత కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో మ‌శూచి వ్యాక్సిన్‌కు ఒక్క‌సారిగా డిమాండ్ ఏర్ప‌డింది. మంకీపాక్స్ నుంచి మ‌శూచి వ్యాక్సిన్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని న‌మ్మ‌డ‌మే అందుకు కార‌ణం.

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు మాట్లాడుతూ మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్దంగా ఉన్నామ‌న్నారు. మంకీపాక్స్ ప‌రీక్ష‌ల‌ను గాంధీ ఆస్ప‌త్రిలో నిర్వ‌హిస్తున్నామ‌ని, చికిత్స‌, ఐసోలేష‌న్ లు ఫీవ‌ర్ ఆస్ప‌త్రిలో అందిస్తున్న‌ట్లు తెలిపారు. మశూచి వ్యాక్సిన్‌ కొనుగోలుపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మా వద్ద స్టాక్‌ ఉందని, కొరత ఉంటే కొనుగోలు చేస్తామన్నారు. మంకీపాక్స్ కోసం సామూహిక టీకాలు వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఎటువంటి మార్గదర్శకాలు లేవు.

మశూచి వ్యాక్సిన్

1979 నుంచి మ‌శూచి వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ఆగిపోయింది. ప్ర‌పంచంలో ఇప్పుడు ఎక్క‌డా త‌యారు చేయ‌డం లేదు. 1979కి ముందు పుట్టిన పిల్లలందరికీ మశూచి వ్యాక్సిన్‌ను వేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన దాదాపు 20 వ్యాధుల‌కు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి.

మశూచి వ్యాక్సిన్‌ వేసిన వారికి మంకీపాక్స్ నుంచి ర‌క్షిస్తుందా..?

కార్డియాలజిస్ట్ డాక్టర్ M.S.S ముఖర్జీ మాట్లాడుతూ చిన్నప్పుడు మశూచి వ్యాక్సిన్ వేసిన వారికి 80 శాతం రక్షణ ఉంది. 1979కి ముందు జన్మించిన వారందరికీ ఆ వ్యాక్సిన్ ఇవ్వబడింది. భారతీయ జనాభాలో చాలా మందికి రక్షణ ఉంటుందని మేము భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో భారతీయులు వైరస్ యొక్క లక్షణరహిత క్యారియర్లుగా ఉంటారని కూడా ఆలోచించబడింది. ఈ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న వారి ద్వారా వ్యాపిస్తోంది.

మంకీపాక్స్ ఇప్పుడు మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 2022లో ఆప్రికాలో మ‌నిషి నుంచి మ‌నిషి మంకీపాక్స్ వ్యాపించి ఉండ‌వ‌చ్చున‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. WHO ప్రకారం జూలై 25, 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 14,000 మంకీపాక్స్ కేసులు న‌మోదు కాగా ఐదుగురు మ‌ర‌ణించారు.

వ్యాప్తి ఎక్కువగా దీని ద్వారా జరుగుతుంది:

- మంకీపాక్స్ సోకిన వారితో ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్య‌క్తుల్లో

- లైంగిక సంబంధం

- చర్మం రాపిడి

- బిందువులు(తుంప‌లు)

- ముఖాముఖి పరిచయం

- పరుపులు, దుస్తులు, శరీర ద్రవాలు, పాత్రలు వంటి కలుషిత పదార్థాల ద్వారా ఒక రోగి నుండి మరొకరికి.

ఇది దీర్ఘకాలిక వ్యాధి

మంకీపాక్స్ న‌యం కావ‌డానికి మూడు నుంచి నాలుగు వారాల చికిత్స అవ‌స‌రం. చర్మంపై దద్దుర్లు ఉన్నవారికి నయం కావడానికి ఈ సమయం పడుతుంది. ఇది లైంగిక అవయవాలు, నోరు మరియు ముఖాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు పేర్కొంటున్నారు.

మశూచి చికిత్సకు అభివృద్ధి చేయబడిన మందులు మంకీపాక్స్ వ్యాధి చికిత్స‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతాయి.


Next Story