మంకీపాక్స్ : అనుమానాలు - అపోహలు, మరి అసలు నిజాలేంటి ?!
Monkeypox: Suspicions - myths, and what is the real truth. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ని ఎమర్జెన్సీగా ప్రకటించింది.
By Nellutla Kavitha Published on 29 July 2022 4:32 PM GMTప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ని ఎమర్జెన్సీగా ప్రకటించింది. నిజంగానే మనం భయపడాల్సిన అవసరం ఉందా? మన దేశంలో కూడా ఆందోళనకర పరిస్థితి ఉందా? డాక్టర్లు ఏమంటున్నారు న్యూస్ మీటర్ నిపుణులతో మాట్లాడింది. ఇప్పటిదాకా మంకీపాక్స్ కి సంబంధించి ఉన్నటువంటి అనుమానాలు, అపోహలను నివృత్తి చేయడానికే ఈ ఆర్టికల్. మంకీ పాక్స్ లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలకు ఉండాల్సిన అవగాహన గురించి న్యూస్ మీటర్ ప్రముఖ డా. ముఖర్జీ తో మాట్లాడింది.
న్యూస్ మీటర్ : ప్రస్తుతం దేశంలో మంకీపాక్స్ గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగానే భయపడాల్సిన పరిస్థితి ఉందంటారా?
డా. ముఖర్జీ : ఇప్పటికిప్పుడే మంకీపాక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రిపోర్ట్ అవుతోంది కాబట్టి మనం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది కాబట్టి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా వ్యాపిస్తుంది అనే దాని మీద ఇప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకరి నుంచి ఒకరికి తాకినప్పుడు వస్తుంది అనేది మాత్రమే తెలుసు కానీ గాలి నుంచి కూడా వ్యాపిస్తుందా లేదా అనేది ఇప్పటి దాకా మనకు తెలియదు. దీంతోపాటు గానే మంకీ పాక్స్ లో జెనెటిక్ మ్యుటేషన్లు కూడా కనిపిస్తున్నాయి. రెండు నుంచి నాలుగు వారాల పాటు లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందికి కనుచూపు పోతే, కొంతమందికి మెదడు మీద ప్రభావం చూపిస్తుంది, అతి అరుదుగా ప్రాణాలు పోయే ప్రమాదముంది. మంకీపాక్స్ ని అంత ఈజీగా తీసుకోలేము, అలాగే అంత భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇది అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదు. మంకీ బాక్స్ లో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ. ఒక శాతం కంటే తక్కువగా మరణాల సంఖ్య ఉంది. దీంతోపాటుగానే ఊపిరితిత్తుల మీద ప్రభావం కూడా చాలా తక్కువ కాబట్టి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ. మంకీపాక్స్ అనుమానితులను ఐసోలేట్ చేయడానికి మాత్రమే హాస్పిటల్స్ లో అడ్మిట్ చేస్తున్నారు. 1979 కి ముందు పుట్టిన వారికి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటారు కాబట్టి monkeypox నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అంటే 80 నుంచి 85 శాతం ప్రజలకు స్మాల్ పాక్స్ నుంచి రక్షణ లభిస్తుంది. స్మాల్పాక్స్, మంకీపాక్స్ దాదాపుగా ఒకే కుటుంబానికి చెందినవి. కొత్త మ్యుటేషన్లు, వేరియంట్లు వస్తున్నాయి కాబట్టి అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
న్యూస్ మీటర్: ఒకపక్క కోవిడ్ కేసులు, మరోపక్క మంకీపాక్స్, ఇంకొకవైపు సీజనల్ డిసీజెస్. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డా. ముఖర్జీ : ప్రజలు మూడు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1. దోమలు కుట్టకుండా చూసుకోవాలి 2. మాస్కు పెట్టుకొని పీల్చే గాలి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 3. తీసుకునే ఆహారం, నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ప్రజలు ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే సగం హాస్పిటల్స్ తో అవసరమే ఉండదు. వీటితో పాటుగా వ్యాక్సిన్ ఎక్కడైతే లభిస్తున్నాయి వాటిని తీసుకోవడం చాలా అవసరం.
న్యూస్ మీటర్ : ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ తోపాటుగా మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా మంకీపాక్స్ కి సంబంధించి నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రజలుగా ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
డా. ముఖర్జీ : కాలం మారుతున్న కొద్ది జాగ్రత్తలు మారొచ్చు. అయితే ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలా సింపుల్. జ్వరంతో పాటుగా రాషెస్ ఉంటే ఇమీడియట్ గా డాక్టర్కి రిపోర్ట్ చేసి ఐసోలేట్ అవ్వమని చెప్తాము. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించి వారిని ఐసోలేట్ చేయించాలి. గ్లౌజ్, మాస్క్ ధరించాలి.
న్యూస్ మీటర్ : కోవిడ్ కి తీసుకున్నట్టుగా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా మంకీపాక్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
డా. ముఖర్జీ : కోవిడ్ లో తీసుకున్నటువంటి ముందుజాగ్రత్తలు ఏవి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోతులు కనిపించినప్పుడు భయపడి పారిపోవాల్సిన అవసరం కూడా లేదు. స్వలింగసంపర్కులలో కొంచెం ఎక్కువగానే మంకీపాక్స్ కేసులు కనిపిస్తున్నాయి. వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, వారి నుంచి వ్యాప్తి చెందుతుంది అనేది ఇప్పటిదాకా మనకు తెలిసింది.
న్యూస్ మీటర్ : వారిపట్ల సమాజంలో కనిపించే వివక్ష ఇప్పుడు లేకుండా చూసుకోవాలి జాగ్రత్త కూడా అవసరం కదా !
డా. ముఖర్జీ : నిజంగానే సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గే వ్యక్తుల నుంచి వచ్చే జబ్బు మాత్రం ఇది కాదు. స్వలింగ సంపర్కుల వ్యక్తుల నుంచి వచ్చే అవకాశం మాత్రం ఉంది, అంతే తప్ప వారికి మాత్రమే వచ్చే జబ్బు కాదు. అందువల్ల వారి పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. అయితే అలా కూడా వ్యాప్తి చెందుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.