మరోసారి మాస్కులు పెట్టుకోవాల్సిందేనా?
ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫ్లుఎంజా, ఫ్లూ వైరస్ చాలా వేగంగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sept 2023 5:19 PM ISTమరోసారి మాస్కులు పెట్టుకోవాల్సిందేనా?
వర్షాలు కురుస్తున్నా.. లేకున్నా.. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫ్లుఎంజా, ఫ్లూ వైరస్ చాలా వేగంగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది. వివిధ ఆసుపత్రుల వైద్యులు రోజూ వందలాది కొత్త కేసులను చూస్తున్నారు. ఆగస్టు ప్రారంభంలో 5 శాతం పాజిటివిటీ రేటు ఉండగా.. ఇప్పుడు 10 శాతానికి పెరిగింది. దీంతో ఫ్లూ వైరస్ భయం ప్రజలను వెంటాడుతూ ఉంది. కరోనా వైరస్ తరహాలో సంక్రమిస్తుందేమోనని ఆందోళన మొదలైంది.
ఊపిరితిత్తులు, శ్వాసకోశ నాళాలను ప్రభావితం చేసే రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వల్ల వచ్చే ఫ్లూ కారణంగా, చాలా మంది పిల్లలు, వృద్ధులు ఈ సీజన్‌లో ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఆందోళన కలిగించే విషయమేమిటంటే, ఇది ఇన్‌ఫ్లుఎంజా వేవ్‌కు ప్రారంభం మాత్రమేనని, దాదాపు నెల రోజుల పాటు ఉధృతి ఉంటుంది. వర్షాలు ఊపందుకున్న తర్వాత కేసులు మరింత పెరుగుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు
వ్యాపిస్తున్న ఇన్ఫ్లుఎంజా వైరస్:
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్, అనస్థీషియాలజిస్ట్, IMA తెలంగాణ సభ్యుడు డాక్టర్ కిరణ్ మాదాల మాట్లాడుతూ, “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వారంవారీ డేటా ప్రకారం.. ప్రతి 100 పాజిటివ్ ఫ్లూ లాంటి కేసులలో, 70 శాతం అలాంటివే. ఇన్ఫ్లుఎంజాలో 10 శాతం మందికి వైరస్ వచ్చిన విషయం కూడా తెలియదు.. ఇక 5 శాతం కోవిడ్, దాదాపు 15 శాతం రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కేసులు ఉన్నాయి.
“వాస్తవానికి, గత మూడేళ్లలో RSV వ్యాప్తి ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అది 14 శాతానికి పైగా ఉంది. ప్రతి ఏడవ పాజిటివ్ కేసు ఒక RSV కేసు. గత రెండు వారాల నుండి, మధ్యంతర-వైరల్ న్యుమోనియా కేసులు కూడా పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మితమైన, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి. వారికి వైద్య సహాయం అవసరం. ఇన్ఫ్లుఎంజా ప్రాణాంతకం కానప్పటికీ, ఇది గర్భిణీ స్త్రీలకు ప్రాణాంతకం కావచ్చు, ”అని డాక్టర్ కిరణ్ తెలిపారు.
హైదరాబాద్, తెలంగాణల్లో విపరీతంగా వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుఎంజా గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడారు. ఆయన కూడా ఇటీవలే స్వయంగా ఇన్‌ఫ్లుఎంజా వైరస్ బారిన పడి కోలుకున్నారు. 'ఇన్‌ఫ్లుఎంజా హెచ్3ఎన్2 వైరస్ హైదరాబాద్, తెలంగాణల్లో మహమ్మారి రూపం దాల్చింది. బాధితుల్లో నేనూ ఒకడిని. ఇది గత కొన్ని రోజులుగా తీవ్రమైన ట్రాకియోబ్రోన్కైటిస్, తగ్గని దగ్గు, తీవ్రమైన బలహీనతకు కారణమవుతోంది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సినేషన్‌ను తీసుకోవాలి.' అని సూచించారు.
రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ప్రమాదాలు
RSV గురించి డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, "ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, సహ-వ్యాధిగ్రస్తులు తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా ప్రమాదంలో ఉన్నారు. భారతదేశంలో ఏటా మూడు కోట్ల RSV కేసులు నమోదవుతున్నాయి. ప్రతి పదవ కేసు ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది.
“ప్రతి సంవత్సరం 60,000 మంది రోగులు RSV వల్ల మరణిస్తున్నారు. ఒక వ్యక్తి RSVని బాధితుడైతే.. భవిష్యత్తులో వ్యాధి పునరావృతమైతే జీవితకాల రోగనిరోధక శక్తికి సంబంధించి కూడా ఎటువంటి హామీ లేదు. ఈ శ్వాసకోశ వ్యాధికి ఇంకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయవలసి ఉంది. పరిశోధనలు కొనసాగుతున్నాయి ”అని డాక్టర్ చెప్పారు.
RSV లక్షణాలు:
RSV యొక్క లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, తలనొప్పి, గొంతు నొప్పి, మూడు నుండి నాలుగు రోజుల తర్వాత చాలా తీవ్రమైన దగ్గు, ఎందుకంటే వైరస్ ఊపిరితిత్తులు, శ్వాసనాళాలపై ప్రభావం చూపుతుంది. కోలుకున్న తర్వాత కూడా, రోగులు దాదాపు రెండు వారాల పాటు తీవ్రమైన అలసట, బలహీనతతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో ICU లో చికిత్స అందించాల్సి ఉంటుంది. మరణాల రేటు 0.2 శాతంగా ఉంది. అంటే ప్రతి 1,000 కేసులకు ఇద్దరు మరణిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిలా పెండ్యాల మాట్లాడుతూ.. ఇన్‌ఫ్లుఎంజా, ఆర్‌ఎస్‌వి, మెటాప్‌న్యూమో, అడెనోవైరస్ సర్ఫేసింగ్‌ల వంటి అనేక కేసులలో పిల్లలకు ఇచ్చే ఫ్లూ టీకాలు ఎంతో రక్షణను అందిస్తాయి. ఉత్తర అర్ధగోళంలో ఉన్న దేశాలలో WHO రోగనిరోధక నియమాల ప్రకారం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్‌ను పునరావృతం చేయాలి. వైరస్‌లలో మ్యుటేషన్‌తో, అదే టీకా మరుసటి సంవత్సరం పనిచేయకపోవచ్చు. వ్యాక్సిన్ లు వైరస్ నుండి 100 శాతం రక్షించలేకపోయినా ఆసుపత్రిలో చేరడం, మరణాల ప్రమాదాలను తగ్గిస్తాయి. కాబట్టి టీకాలు తీసుకోవడం మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు
ఇన్‌ఫ్లుఎంజా, ఆర్‌ఎస్‌వీ వైరస్‌ల నుంచి రక్షణ పొందేందుకు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. “రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడమే కాకుండా, చేతి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇలా చేస్తే చాలా వైరస్‌లు, ఇతర వ్యాధికారకాల నుండి కాపాడుకోవచ్చు. సిట్రస్ పండ్లు, విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకోవడం, విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా ఫ్లూకు సంబంధించి తేలికపాటి లక్షణాలను అనుభవిస్తే, వారు గోరువెచ్చని ఉప్పునీరు లేదా బెటాడిన్ ద్రావణంతో పుక్కిలించాలి. త్వరగా కోలుకోవడానికి ఆవిరిని పీల్చుకోవాలి, ”అని డాక్టర్లు సూచించారు.