Summer: వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు పాటించండి
ఎండాకాలంలో ప్రజలు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే వడదెబ్బకు, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
By అంజి Published on 15 March 2023 8:28 AM GMTSummer: వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు పాటించండి
ఈ సారి కాసింత ముందుగానే ఎండాకాలం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎండాకాలంలో ప్రజలు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే వడదెబ్బకు, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ఆరోగ్యశాఖ పలు మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజలు మధ్యాహ్నం 12-3 గంటల మధ్య అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి. అత్యవసరం కాకపోతే ఇంట్లో ఉండే పని చేసుకోవడం ఉత్తమం. పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లొద్దు.
తరచూ మంచి నీటిని తాగుతూ ఉండాలి. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఎండాకాలంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. మధ్యాహ్నం పూట వంట చేసుకోకపోవడం మంచిది. వీలైతే వంటింటి డోర్లు, కిటికీలు తెరిచి ఉంచాలి. టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి చక్కెర అధికంగా ఉన్న ద్రవ పదార్థాలు తీసుకోవద్దు, అవి శరీరంలోని నీటిని ఎక్కువగా బయటికి పంపుతాయి. అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవద్దు.
పార్కింగ్‌లో వాహనాలు ఉన్నచోట పిల్లలు, పెంపుడు జంతువులను ఒంటరిగా వదిలేయొద్దు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 104 డిగ్రీ ఫారన్‌హీట్ కన్నా పెరగడం, తల తిరగడం, నీరసంగా అనిపించడం, చర్మం పొడిబారడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గుండె లయ తప్పడం వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
అలాగే వడదెబ్బపై ప్రజలకు వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పించనుంది. జిల్లాస్థాయిలో హెల్ప్‌లైన్ సెంటర్లు, అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఏర్పాటు చేయనుంది. ఇవి 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు, ఇతర మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వేసవిలో నీటి కొరతతో సహా ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లను మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదేశించారు.