కన్ను అదరడాన్ని శకునంగా భావిస్తారు. ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవని విశ్లేషిస్తుంటారు జ్యోతిషవేత్తలు. ఈ నమ్మకం తాము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది ప్రాచుర్యంలో ఉందని చెబుతారు. అయితే, మంచి చెడులను తెలియజేయడానికే కన్ను కొట్టుకుంటుందా లేదా శరీరంలో ఏదైనా సమస్య వల్లా అనేది మీరు ఇప్పుడు తెలుసుకోండి.
కన్ను ఎందుకు అదురుతుంది?
కంటి రెప్పలోని కండరాలు అసంకల్పితంగా సంకోచించినప్పుడు కన్ను కొట్టుకుంటుంది. ఇవి మూడు రకాలుగా పేర్కొంటారు.
1.మయోకిమియా: సాధారణంగా ఇది ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. కండరాల ఆకస్మిక సంకోచం వల్ల ఇలా ఏర్పడుతుంది.దిగువ కనురెప్పలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్వల్ప కాలమే ఉంటుంది.
2.హెమిఫేషియల్ స్పస్మ్, బ్లేఫరోస్పస్మ్: జన్యు సంబంధిత సమస్య వల్ల హెమిఫేషియల్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది శరీరంలోని అంతర్గత సమస్యలను సూచిస్తుంది.
3.బ్లేఫరోస్పస్మ్: ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది సెకన్లు, నిమిషాలే కాదు, కొన్నిసార్లు గంటల సేపు కళ్లు అదురుతూనే ఉంటాయి.
కన్ను అదరడానికి కారణాలు ఇవే:
నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. మీ కన్ను పదే పదే అదురుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.