సీసీఎంబీ అధ్య‌య‌నం : భార‌తీయుల్లో మ‌ధుమేహం ముప్పు.. ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రికి

Every sixth Indian is a potential diabetic CCMB study.భారతదేశంలో ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు మధుమేహ వ్యాధిగ్రస్తులేనని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2022 10:43 AM IST
సీసీఎంబీ అధ్య‌య‌నం : భార‌తీయుల్లో మ‌ధుమేహం ముప్పు.. ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రికి

భారతదేశంలో ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు మధుమేహ వ్యాధిగ్రస్తులేనని సీసీఎంబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్‌-2 మ‌ధుమేహానికి జ‌న్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో తెలుసుకునేందుకు జ‌నాభా నిర్దిష్ట జ‌న్యుప‌ర వ్య‌త్యాసాల‌పై ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేశారు. విభిన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై ఈ అధ్య‌య‌నం చేప‌ట్టారు.

'DIAMANTE' (డయాబెటిస్ మెటా-ఎనాలిసిస్ ఆఫ్ ట్రాన్స్-ఎత్నిక్ అసోసియేషన్ స్టడీస్) అనే శీర్షికతో.. మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ మోరిస్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఇది `నేచర్ జెనెటిక్స్'లో ప్రచురించబడింది.

టైప్ 2 డయాబెటిస్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంది. ఇది తీవ్ర‌మైన అనారోగ్యంతో కూడిన కుటుంబ వ్యాధి. గ‌త మూడు ద‌శాబ్దాల‌లో మ‌ధుమేహ బాధితుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ద‌క్షిణాసియాలో ముఖ్యంగా భార‌త్‌, చైనా దేశాల్లోని ప్ర‌జ‌లు మధుమేహ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న భార‌తీయుల‌కు టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వారిలో ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువగా ఉంది. వారి విసెరల్ అవయవాల చుట్టూ ఉన్న కొవ్వు పుట్టినప్పటి నుండి ఎక్కువ ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది సాధారణీకరించిన పద్ధతిలో మొత్తం లావుగా ఉన్న యూరోపియన్లకు భిన్నంగా ఉంటుంది.

యూరోపియన్లతో పోలిస్తే భారతీయుల్లో జన్యుపరమైన వైవిధ్యం ఎక్కువ కావడంతో యూరోపియన్‌ డేటాను ఉపయోగించి భారతీయ జనాభాలో టైప్‌-2 మధుమేహం ప్రమాదాన్ని అంచనా వేశారు. మధుమేహంతో బాధపడుతున్న 1.8 లక్షల మంది వ్యక్తుల డీఎన్‌ఏను అయిదు పూర్వీకుల సమూహాలకు చెందిన 11.6 లక్షల సాధారణ నమూనాలతో పోల్చారు. ఈ సమూహాల్లో యూరోపియన్లు, తూర్పు ఆసియా వాసులు, దక్షిణాసియా వాసులు, ఆఫ్రికన్లు, హిస్పానిక్‌లు ఉన్నారు. ఈ అధ్యయనం ఫలితాల ఆధారంగా భారతీయుల్లో ప్రతి ఆరో వ్యక్తి మధుమేహ బాధితుడు కావొచ్చని తేలిందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR – CCMB)లో చీఫ్ సైంటిస్ట్ మరియు ప్రధాన పరిశోధకులలో ఒకరైన డాక్టర్ చందక్ తెలిపారు.

ఈ అధ్య‌య‌నం ద‌క్షిణాసియా ప్ర‌జ‌ల‌కు జ‌న్యుప‌రంగా వ‌చ్చే టైప్‌-2 డ‌యాబెటిస్ గురించి తెలుసుకునేందుకు ఉప‌యోగప‌డుతోంద‌ని, త‌ద్వారా ఖ‌చ్చిత‌మైన ఔష‌దాన్ని క‌నుగొడంలో సహాయ ప‌డుతోందని CCMB డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి చెప్పారు.

Next Story