మన ఫ్రెండ్స్, బంధువుల్లో కొంత మందికి గోళ్లు కొరికే అలవాటు ఉండటాన్ని మనం గుర్తించే ఉంటాం.. చిన్నారుల్లో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల్లో ఎవరికైనా గోళ్లు కొరికే అలవాటుంటే అది చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. పెద్దవారిలో కొందరు ఏదో ఆలోచిస్తున్నప్పుడు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, ఇతరులపై కోపంగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు గోళ్లు కొరకడాన్ని గమనించవచ్చు.
ఇలా చేయడం వల్ల గోళ్లలో చేరిన బ్యాక్టీరియా నోటి నుంచి కడుపులోకి ప్రవేశించి జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా విరేచనాలు, వాంతులు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ హానికర బ్యాక్టీరియా గోళ్లను కొరికినప్పుడు పళ్లపై, చిగుళ్లలోకి చేరి దంత సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. అలాగే శరీరంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌లకు అవకాశం కల్పిస్తుంది. అందుకే చిన్నారులకు గోళ్లు కొరికే అలవాటు ఉంటే.. వారికి దీని వల్ల కలిగే నష్టాలను వివరించారు. చిన్నప్పటి నుంచి గోళ్లను చిన్నగా కత్తిరించుకోవడం అలవాటు చేయాలి.