బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Did you know these things about breast cancer. ప్రస్తుత రోజుల్లో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్. ఎన్ని జాగ్రత్తలు

By అంజి  Published on  16 Jan 2023 1:00 PM IST
బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుత రోజుల్లో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి సెలెబ్రెటీల వరకూ చాలా మందిని ఈ వ్యాధి పట్టి పీడిస్తోంది. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ఎందుకు వస్తుంది. ఈ వ్యాధి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు చూద్దాం.

ముఖ్య కారణాలు ఇవే

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మారిన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా బరువు పెరగడం, పీరియడ్స్ ముందుగానే రావడం, మొనోపాజ్ లేట్‌గా రావడం.. వీటి వళ్ల మహిళల్లో హార్మోన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయంటున్నారు. చిన్న వయసులోనే లింఫోమాకి ట్రీట్‌మెంట్ తీసుకోవడం.. తద్వారా వచ్చే రేడియేషన్ కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు కారణమని చెప్తున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ ఎన్ని రకాలు ?

బ్రెస్ట్ క్యాన్సర్‌లో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అవి.. స్పారోడిక్, జనెటిక్, లైఫ్ స్టైల్ కారణంగా వచ్చే క్యాన్సర్స్. స్పారోడిక్ అంటే సాధారణంగా అనారోగ్యం కారణంగా వచ్చే క్యాన్సర్. జెనెటిక్ అంటే వంశపారపర్యంగా సోకే క్యాన్సర్. ఇక మూడోది మన జీవితంలో మార్పుల కారణంగా వచ్చేది. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఈ మూడో రకం క్యాన్సర్ బారిన పడుతున్నారు.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి ?

బ్రెస్ట్ క్యాన్సర్‌ను కొన్ని ముఖ్యమైన లక్షణాల ద్వారా గుర్తించవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. బ్రెస్ట్, చంకల్లో గడ్డలు రావడం, అసహజంగా బ్రెస్ట్ సైజ్ మారడం వంటివి క్యాన్సర్ లక్షణాలంటున్నారు. ఛాతిపై చర్మం రంగు మారడం, గుంతలు పడినట్టుగా కనిపించడం కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చని చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు గనక మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదంటున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం, మెడిటేషన్, యోగా లాంటివి జీవితంలో భాగం చేసుకోవడం ముఖ్యమంటున్నారు. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం.. రెడ్ మీట్‌తో పాటు కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ మానేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ?

బ్రెస్ట్ క్యాన్సర్‌ తగ్గించేందుకు కీమో థెరపీ ట్రీట్‌మెంట్ ఇస్తారు. కానీ దీని వల్ల ఇన్‌ఫెర్టిలిటీ వచ్చే ప్రమాదముందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం ఉండదన్నమాట. కానీ.. ట్రీట్‌మెంట్‌కి ముందు ట్రయో ప్రిజర్వేషన్ ద్వారా అండాలను ప్రిజర్వ్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీని ద్వారా.. క్యాన్సర్ చికిత్స ముగిసిన తరువాత.. ఈ ప్రిజర్వ్ అండాల ద్వారా గర్భం దాల్చవచ్చు. సో.. కీమో థెరపీ చేయించుకునే ముందు ఈ ప్రక్రియను ఫాలో అవడం మంచిదంటున్నారు.

ట్రీట్‌మెంట్ ఎలా ?

బ్రెస్ట్ క్యాన్సర్‌కు ముఖ్యంగా 4 రకాల చికిత్సలు ఉంటాయి.. ఆపరేషన్, కీమో థెరపీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ. పేషెంట్‌లో క్యాన్సర్ ఉన్న స్టేజ్‌ని బట్టి.. ఏ ట్రీట్‌మెంట్ ఇవ్వాలో డాక్టర్లు డిసైడ్ చేస్తారు. ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించాక ఇక మెడిసిన్స్‌తో దాన్ని తగ్గించలేమంటున్నారు డాక్టర్లు. ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి ఉంటుందంటున్నారు. కాకపోతే మొదటి స్టేజ్‌లోనే ఈ సమస్యను గుర్తిస్తే హార్మోన్ థెరపీ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

అపోహలు వద్దు

చాలా మందిలో వేరే కారణాల వల్ల వచ్చిన గడ్డలను కూడా క్యాన్సర్ అనునకుని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ కాకపోవచ్చి డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య వస్తుందని చెప్తున్నారు. అందుకే సరైన మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.

Next Story