థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు నిత్యం మాత్రలు వేసుకోవడం తప్పనిసరి. అయితే కొందరు పేషంట్లు థైరాయిడ్ టెస్ట్ చాలాకాలం చేయించుకోకుండా థైరాయిడ్ హైడోసు టాబ్లెట్స్ వాడతారు. ఇలాంటప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకోవడం, చెమటలు, శరీరం వేడి ఎక్కువగా ఉండటం, చేతులు వణకడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయడం, ఆయాసం, యాంగ్జైటీ, చిరాకు వంటి సమస్యలతో పాటు ఆస్టియోపోరసిస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గుండె దెబ్బతినడం, స్పృహ కోల్పోవడం, బీపీ పెరగడం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రతి 6 నెలలకు థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని వైద్యులు సూచించిన మాత్రలు వాడాలని చెబుతున్నారు.
థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?
సాధారణంగా థైరాక్సిన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల గర్భం ధరించడం కష్టమవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సంతానలేమికి దారితీస్తాయి. కాబట్టి సమస్యను గుర్తించి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే సంతానం పొందొచ్చు. అలాగే గర్భం ధరించిన తర్వాత కూడా డాక్టర్ల సలహా తీసుకుని చికిత్స/ మందులను కొనసాగించాలి.