కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమం
Arthritis awareness program under Kim's Hospital
By అంజి Published on 11 Oct 2022 5:04 PM ISTహైదరాబాద్: మన దేశంలో సుమారు 6 కోట్ల మంది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, రుమటాలజికల్ వ్యాధులను చాలా మంది తరచు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ సమస్యలు వృద్ధాప్యం వల్ల వచ్చాయనుకుంటారు. ఈ అపోహ వల్ల చాలా మంది ప్రజలు చికిత్స పొందడానికి కూడా ప్రయత్నించరు. అందువల్ల ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా, ఆర్థరైటిస్‌కు చికిత్స ఉందని చెప్పాలన్నదే మా ప్రధాన ఉద్దేశం.
ఆర్థరైటిస్ వల్ల తలెత్తే సమస్యలు బాధాకరంగా ఉండటమే కాకుండా, ప్రాణాంతకం కావచ్చు. ఇవి ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లాంటి పలు అవయవాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల రోగులకు గుండెపోటు వచ్చే ప్రమాదం 200% ఎక్కువగా ఉంటుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 150% ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద, వారికి వార్ధక్యం త్వరగా వస్తుంది. (వారు తమ వాస్తవ వయస్సు కంటే పదేళ్లు పెద్దగా కనిపిస్తారు).
ఈ వ్యాధులు కేవలం వృద్ధులను మాత్రమే కాదు... పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు.. ఇలా ఏ వయస్సు వారైనా ప్రభావితం చేస్తాయి. ఆర్థరైటిస్ కు కారణమయ్యే 100 కంటే ఎక్కువ వేర్వేరు వ్యాధులు ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ (లూపస్), సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి అనేక ఇతర వ్యాధులు సాధారణమైనవి. శారీరకంగా బాధ కలిగించే ఈ వ్యాధి ఉండటం వల్ల అది ఉన్నవారి ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. సాధారణ జనాభాతో పోలిస్తే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న రోగులలో నిరాశ రెట్టింపు ఉంటుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ జాయింట్ ఆర్థరైటిస్ చికిత్సకు ఏడాదికి సుమారు రూ.53,000 ఖర్చవుతుందని అంచనా. వ్యాధి వల్ల నేరుగా పడే ఆర్థిక భారంతో పాటు, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు కాబట్టి, కుటుంబ జీవితంపైనా తీవ్రప్రభావం ఉంటుంది. ఇంట్లో మహిళ దీర్ఘకాలిక రుమటాలజికల్ వ్యాధితో బాధపడుతుంటే కుటుంబం మొత్తం, ముఖ్యంగా పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. పిల్లలు లేదా భర్త మహిళతోపాటుగా ఆసుపత్రికి వెళ్లడానికి సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చులు పెరగడం, పనిగంటలు కోల్పోవడం, ఉత్పాదకత తగ్గడం లాంటివి ఉంటాయి. ఈ వ్యాధి వల్ల వైకల్యం సంభవించి, రోజువారీ కార్యకలాపాలు కూడా ఇబ్బందికరం అవుతాయి.
ఆర్థరైటిస్ ఉన్న రోగులు సామాజిక ఒంటరితనంతో పాటు కొన్నిసార్లు ఉద్యోగం కూడా కోల్పోతారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న ప్రతి నలుగురు రోగుల్లో ముగ్గురి పని సామర్థ్యం దెబ్బతిందని, ప్రతి ఐదుగురిలో ఒకరు శాశ్వతంగా పని మానేయాల్సి వచ్చిందని మన దేశంలో చేసిన పరిశోధనల్లో తేలింది.
వ్యాధి కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పడే ఆర్థిక భారాన్ని రోగి, వారి కుటుంబం భరించాలి. బీమా కంపెనీలు ఆర్థరైటిస్ వల్ల కలిగే సమస్యలకు చెల్లింపులు చేసే విధానం అత్యంత అశాస్త్రీయంగా, పక్షపాతపూర్వకంగా, పురాతనమైనదిగా ఉంటుంది. వాటిలో చాలావరకు చికిత్స చేయలేనివని వర్గీకరించారు. దానివల్ల మన దేశంలో బీమా, హెల్త్ కేర్ డెలివరీ ప్రొవిజన్లలో ప్రస్తుత విధానాలను రీయింబర్స్ మెంట్ బెనిఫిట్ల నుంచి మినహాయించారు. వేరే దేశాల్లో మాత్రం చాలావరకు బీమా కంపెనీలు ఈ సమస్యలకు కవరేజి కల్పిస్తాయి. దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ రీయింబర్స్ మెంట్ మార్గదర్శకాలను ఇటీవలి విప్లవాత్మక చికిత్స విధానాల దృష్ట్యా సమూలంగా మార్చాల్సిన తక్షణ అవసరం ఉంది.
ఆర్థరైటిస్, రుమటాలజికల్ రుగ్మతలకు కారణమయ్యే వ్యాధులు చాలావరకు ఉన్న అపోహల కారణంగా బయటపడవు. ఈ వ్యాధులకు చికిత్సచేయడంలో ఇటీవలి కాలంలో వచ్చిన అత్యాధునిక విధానాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇలా చికిత్సతీసుకునే రోగుల జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతోంది. కానీ, అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సను పొందేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఇది రోగులకు అనవసరమైన దుఃఖం, బాధను కలిగిస్తుంది. చాలామంది సరైన సమయంలో చికిత్స పొందకపోవడం వల్ల నష్టపోయి తీవ్రంగా బాధపడతారు.
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం థీమ్.. ''కీళ్ల వ్యాధులకు చక్కని చికిత్స ఉంది''
ఆర్థరైటిస్, ఇతర రుమటాలజికల్ సమస్యలకు కారణమయ్యే వ్యాధుల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వైద్యులు, రోగులు ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ఈ వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పలు కార్యకలాపాలు చేస్తాయి. ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని అనేక సంవత్సరాలుగా చేసుకుంటున్నా, భారతదేశంలో జరిపిన పరిశోధన ప్రకారం, రోగులు రోగలక్షణాల ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తప్ప రుమటాలజిస్టులను కలవట్లేదు. వైద్యం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు ఇకపై ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను భరించాల్సిన అవసరం లేదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఆ రోజు చేసే అన్ని కార్యకలాపాలకు ''కీళ్ల వ్యాధులకు చక్కని చికిత్స ఉంది'' అనే థీమ్‌ను నిర్ణయించారు.
ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమం:
సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో 2022 అక్టోబర్ 11న ఆర్థరైటిస్ పరిస్థితులపై అవగాహన కల్పించానికి ఇక్కడి రుమటాలజీ విభాగం ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలు వర్గాలకు చెందిన ఆర్థరైటిస్ బాధితులు పాల్గొన్నారు. ఇంటరాక్టివ్ సెషన్ లో, రోగుల ప్రశ్నలకు సీనియర్ రుమటాలజిస్టులు సమాధానం ఇచ్చారు. కొంతమంది రోగులు తమ విజయ గాథలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వారి కథల్లో కొన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో, రోగులు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు, పీజీ వైద్యులు, వైద్యులు పాల్గొన్నారు.
కిమ్స్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర మౌళి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుమటాలజిస్టులు డాక్టర్ జుగల్ కిశోర్, డాక్టర్ శ్రీశైల దత్తా, డాక్టర్ సువర్ణ శిల్ప పాల్గొన్నారు.
కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రుమటాలజిస్టులు డాక్టర్ జుగల్ కిషోర్, డాక్టర్ శ్రీశైల దత్త, సువర్ణ శిల్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపోహలు - వాస్తవాలు అనే పుస్తకాన్ని డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ఆవిష్కరించారు. కిమ్స్ సీనియర్ వైద్యులు రాసిన ఈ పుస్తకం ప్రజల్లో మన ఆరోగ్యం విషయంలో ఉండే పలురకాల అపోహలను దూరం చేస్తుంది.