రాష్ట్రంలో ఉన్న ఎవరికీ 'కరోనా' సోకలేదు: మంత్రి ఈటల
By సుభాష్ Published on 4 March 2020 6:28 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరికీ కరోనా సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని అన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలన్నారు. మహేంద్రాహిల్స్ వద్ద ముందు జాగ్రత్తగా శానిటేషన్ నిర్వహించామని, మహేంద్రాహిల్స్ వ్యక్తి ఇంట్లో వారికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వారికి నెగెటివ్ వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 45 మందికి నెగెటివ్ వచ్చిందని, ఇద్దరు కరోనా అనుమానితుల శాంపిల్స్ ను పుణేకు పంపించామని అన్నారు.
ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదు
ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, కరోనాపై అనుమానాలుంటే 104కు కాల్ చేయాలని మంత్రి ఈటల సూచించారు. కేంద్రంతో సంప్రదించి ప్రైవేటు ఆస్పత్రులకు కూడా శాంపిల్స్ సేకరణకు అనుమతించామని, ప్రతి పేషెంటూ గాంధీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా వైద్యానికి అనుమతి ఇచ్చామని, పరీక్షలు మాత్రం ప్రభుత్వ ల్యాబుల్లోనే జరుగుతాయని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ చేసినట్లు ఈటల వివరించారు.
అలాగే నలుగురు ఐఏఎస్ అధికారులతో నిపుణుల కమిటీ వేశామని, కరోనా పాజిటివ్ వస్తే కేంద్రం మాత్రమే అనౌన్స్ చేస్తుందన్నారు. కరోనా ఉన్న వ్యక్తి అతి దగ్గరగా తుమ్మడం, దగ్గడం వల్లనే కరోనా వస్తుందని, సాప్ట్ వేర్ కంపెనీలు హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.