తనకు కరోనా లక్షణాలు లేవు.. అందుకే..! : ట్రంప్
By Newsmeter.Network Published on 14 March 2020 10:14 AM ISTకరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోయితున్నాయి. ఇప్పటికే అనేక దేశాలను ఈ మహమ్మారి వైరస్ భయపెడుతుండగా.. అగ్రరాజ్యం అమెరికాసైతం అలర్ట్ అయింది. ఆ దేశ అధ్యక్షుడు అమెరికా జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభణను అడ్డుకొనేందుకుగాను చేపట్టిన చర్యలకు మద్దతుగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో కరోనా వైరస్ పరీక్షలు చాలా ఆలస్యం అవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన నేపథ్యంలో వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే వైరస్‌ను నియంత్రించేందుకు 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.6లక్షల కోట్లు)కేటాయిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఇప్పటి వరకు 1701 కోవిడ్ -19 కేసులునిర్దారణ అయ్యాయి. 40 మంది చనిపోయారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. భారీ సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడకుండా, క్రీడా కార్యక్రమాలను రద్దు చేశాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. వైరస్ మరింత ప్రబలకుండా నిరోధించడంలో వచ్చేవారం చాలా కీలకమని ట్రంప్ తెలిపారు.
మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవరోధాలను అధిగమిస్తాం - ట్రంప్
వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. నోవెల కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే అమెరికాలో జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగిందని తెలిపారు. వైరస్ నియంత్రణకు 50బిలియన్ డాలర్ల నిధిని కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవరోధాలను అధిగమిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. తమ ఆదేశాల మేరకు కార్నివాల్, రాయల్ కరేబియన్, నార్వేయస్, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌లను 30రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజలు ఎక్కడ ఉన్నా విశ్వాసంతో అందరి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 15న నేషనల్ ప్రేయర్ డేగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
విపత్కర సమయాల్లో దైవ రక్షణ కోసం కూడా ఎదురుచూసిన చరిత్ర అమెరికాకు ఉందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా వైరస్ రెస్పాన్స్ యాక్ట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు, ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ట్రంప్ డెమోక్రాట్లు, రిపబ్లికన్లను కోరారు. ఈ బిల్లు ద్వారా ఉచితంగా కరోనా వైరస్ పరీక్షలు చేపట్టనున్నామన్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు పెయిడ్ లీవ్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ కరోనాపై సమరం మోగించడంతో వాల్ స్ట్రీట్‌లో మార్కెట్ షేర్లు దూసుకెళ్లాయి.
తనకు కరోనా లక్షణాలు లేవు.. అందుకే..!
కరోనా వైరస్ సోకిన వారిని కలిసినప్పటికీ పరీక్ష ఎందుకు చేయించుకోలేదని ట్రంప్‌ను ప్రశ్నించగా.. తనకు కరోనా లక్షణాలు ఏమీ లేవని, అందుకే ఇప్పటి వరకూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం రాలేదని బదులిచ్చారు. వీలైనంత త్వరలోనే తాను కూడా కోవిడ్ -19 పరీక్ష చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సెనారో మీడియా సెక్రటరీ ఫాబియో వజ్నగర్టెన్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది.
ఈ మధ్యనే ట్రంప్ ఫ్లోరిడా పర్యటనకు వెళ్లారు. అక్కడికి వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడితో పాటు ఫాబియోను కూడా కలిశారు. ట్రంప్‌తో భుజంభుజం కలిపి నిలబడిన ఫాటోను ఫాబియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కోవిడ్ -19 వ్యాధి వచ్చినవారిని కలిసిన ఎవరైనా సరే 14 రోజుల పాటు ఇతరులు ఎవరినీ కలవకుండా స్వీయ గృహనిర్భందంలో గడపాలని అమెరికా అధికారికంగా సలహా ఇచ్చింది. కానీ తనకు కరోనా లక్షణాలు ఏమీ లేనందువల్ల స్వీయ గృహనిర్భదంలో ఉండాల్సిన పనిలేదని ట్రంప్ తెలిపారు.