విధి వంచిత హసిత.. విజేత..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  31 July 2020 9:15 AM IST
విధి వంచిత హసిత.. విజేత..!

ఆటను కబళించిన అటాక్సియా వ్యాధి

ఆ అమ్మాయి హసిత.. ఫుట్‌బాల్‌ గ్రౌండులో కాలు పెడితే చాలు చిరుత! ఎదుటి టీమ్‌కు బాలు చిక్కకుండా కాలిని కథకళిలా కదుపుతూ కళాత్మకంగా ఆడటంలో ఆమెకు ఆమె సాటి. టీమ్‌లో ఆమె ఉందంటే.. ప్రత్యర్థులకు వణుకే. తన ఆట నైపుణ్యంతో ఆమె అంచెలంచెలుగా ప్రగతి పథాన దూసుకెళుతోంది. ఇంతలో ఓ చిన్న స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డు తగిలింది. ఆ తర్వాత ఏమైంది?

హసిత తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పుట్టింది. ఆమె అమ్మమ్మ వాళ్లుండే వూరు. తండ్రి రాజు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ టెక్కీ. తల్లి శారద డిగ్రీ దాకా చదివింది. హసిత పుట్టిన ఏడాదికే అదృష్టం వారి తలుపు తట్టింది. రాజుకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. కుటుంబం అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుటుంబంలో హసిత తమ్ముడు వచ్చాడు. మంచి ఉద్యోగం.. చిన్న కుటుంబం.. ఆర్థికంగా ఇబ్బందుల్లేవు. హసిత స్వేచ్ఛగా పెరిగింది. అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతుండటంతో తూనీగలా తుళ్లుతూ ఉండేది. హసిత చదువుతోపాటు స్విమ్మింగ్‌ నేర్చుకుంది. ఆటల్లో ఫస్ట్‌ ఉండేది. జిమ్నాస్టిక్‌కు వెళ్లేది. ఫుట్‌బాల్‌ ఆట తనకు నచ్చింది. అందులోనే తన భవితను నిర్మించుకోవాలనుకుంది. నిరంతర శ్రద్ధ ఆటపై మమకారం ఉండటంతో హసిత అతి తక్కువ కాలంలోనే మంచి ప్లేయర్‌గా పేరు తెచ్చుకుంది.

H1

అటు చదువు.. ఇటు ఫుట్‌బాల్‌ ఆటలో పరుగులు తీస్తూ హసిత తనకు తానే సాటి అన్నట్టుండేది. అంతా బావుంది.. ఆటే కాదు జీవిత లక్ష్యం కూడా సెట్‌ అయింది అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి హసిత వేగం తగ్గుముఖం పట్టింది. ఎంత ప్రయత్నించినా పుంజుకోవట్లేదు. ఓ రోజు కదల్లేని స్థితిని వచ్చింద. ఆ రోజు ఇంటికి వచ్చాక వంగి నడుస్తుంటే.. ఏమైంది అని అమ్మానాన్న అడిగారు. నొప్పి లేదుగానీ ఎందుకో నిలబడలేకపోతున్నానని చెప్పింది. డాక్టర్‌ను కలిస్తే ఏం ఫరవాలేదు. కాస్త బరువు తగ్గితే అంతా సరిపోతుంది అన్నారు. హసిత ఎందుకు నడవలేకపోయిందో డాక్టర్లు మొదట గుర్తించలేకపోయారు. రకరకాలు టెస్టులు చేశారు. కానీ దేన్లోనూ కారణం తెలీడం లేదు. ఏడాది తర్వాత అది అటాక్సియాక అనే నరాల వ్యాధి అని గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడినవారి మెదడు ఇచ్చే సంకేతాలు ఇతర శరీర భాగాలకు అందవు. ఫలితంగా కాళ్లు పనిచేయవు.

ఏడాది తర్వాత ‘ఇక మీ అమ్మాయి నడవదు’ అని తేల్చేశారు. ఈ మాట విన్న హసిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె కాదు ఆమె ఆశలు ఆశయాలు కూడా! తలిదండ్రులు ఈ పరిణామానికి హతాశులయ్యారు. హసిత ఈ వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది. మెరుపు వేగంతో పరుగులు తీసిన హసిత నాలుగు అడుగులు వేయడం కష్టమయ్యింది. వ్యాధి చికిత్స కోసం తలిదండ్రులు తిరగని ఆస్పత్రిలేదు.. కలవని డాక్టర్లు లేరు. అయినా ఏమాత్రం గుణం కనిపించలేదు. ఈ లోగా హసిత నడకతీరు పూర్తిగా మారిపోయింది. బడిలో సాటి విద్యార్థులు ఆమెను వెక్కిరించేవారు, ఎగతాళి చేసేవారు. ఇంటికొచ్చి తన అసహాయతకు ఏడ్వడం తప్ప హసితకు పరిష్కారం లభించలేదు. ‘క్రమంగా నేను ఎవరితోనూ మాట్లాడ్డం మానేశాను. అన్నివిధాల కుంగి పోయాను. వత్తిడి పెరిగిపోతుండటంతో అమ్మానాన్న నన్ను ఇండియాకు తీసుకొచ్చేశారు. అప్పటికే నాకు వీల్‌చైర్‌ దోస్త్‌ అయింది.’ అంటూ ఆవేదనతో తెలిపింది హసిత.

H2

ఇండియాకు వచ్చాక రాజుకు పుణెలో ఉద్యోగం వచ్చింది. కుటుంబం చెన్నైలో ఉండేది. చెన్నైలో ఓ స్కూల్‌లో నైన్త్‌ క్లాసు చేరింది. అక్కడి టీచర్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని బాగా సహకరించేవారు. స్కూల్‌కు వీల్‌చైర్లో కాకుండా తమ్ముడి సాయంతో నెమ్మదిగా నడిచే వెళ్లేది. నెమ్మదిగా మనసు కుదుటపడింది. చదువులపై దృష్టి పెట్టింది. ఒక్కో క్లాసులో ఉత్తీర్ణత సాధిస్తూ ఎంసెట్‌లో మంచి ర్యాంకు కొట్టింది. పుణెలో బీటెక్‌ మైక్రోబయాలజీలో చేరింది. తల్లి శారద హసితను హాస్టల్‌ ఉండాల్సిందిగా సూచించింది. అక్కడైతే ఒంటరిగా బతకడం అలవాటవుతుందని ఆమె నమ్మిక. బీటెక్‌ చదువే కాదు జీవితం అంటే ఏంటో నేర్పింది. స్వతంత్రంగా బతకడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ప్రాక్టికల్‌గా తెలిసొచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్‌ సీసీఎంబీలో ఆరునెలల ప్రాజెక్టు చేసింది. ప్రాజెక్టు వివరాలు బ్లాగులో రాయాల్సి వచ్చింది. ప్రతి సందర్భం ఓ అవకాశంగా మలచుకోవచ్చనడానికి ఇదే సాక్ష్యం. చదువు కోసం బ్లాగ్‌ కావల్సి వచ్చినా.. కొన్నాళ్ళకు తనే సొంతంగా ‘టర్నింగ్‌ పాయింట్‌ 5’ పేరుతో ఓ బ్లాగ్‌ సృష్టించి రాసేది. క్రమంగా తనలాంటి దివ్యాంగుల కష్టాలు.. విజయాలు కథనాలుగా రాయడం ప్రారంభించింది. అంతటితో తృప్తి చెందక ప్రముఖుల రచనలపై సమీక్షలు చేస్తుండేది.

ఒక్కసారి నెట్టింట అడుగుపెట్టాక ఎవరూ ఆగిపోరు కదా! హసిత కూడా అంతే. బ్లాగుతో పాటు ‘లైఫ్‌ విత్‌ హసీ.కామ్‌’ పేరిట ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. ఈ ఛానెల్‌లో మహిళల అనుభవాలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేది. ఈ దాహం తీరనిది అన్నట్టూ.. తనో రచయిత్రి కావాలన్న కోరిక చిగురించింది. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉంది. గతేడాది హసిత గ్లోబల్‌ ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ అవార్డు అందుకుంది. మిస్‌ వీల్‌ఛైర్‌ ఇండియా పోటీలో పాల్గొంది. ఇవేకాకుండా స్కూళ్ళు,కాలేజీలు సందర్శిస్తూ.. తన అనుభవాలను పంచుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. వంచించిన విధిని ఎదురించి నిలవడమంలే ఇదే! ఎదురైన కష్టాలను అధిగమించి.. కమ్ముకున్న పెనుచీకటి ఆవల వెలిగే ఉదయం కోసం శ్రమించడం అంటే ఇదే!!

Next Story