జమ్మూకశ్మీర్‌కు ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారు : ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌కు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి కానున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌లో ప్రకటించారు

By Medi Samrat  Published on  8 Oct 2024 6:08 PM IST
జమ్మూకశ్మీర్‌కు ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారు : ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌కు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి కానున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌లో ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి విజయం సాధిస్తుందని తేలిన తర్వాత ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రకటన చేశారు. పదేళ్ల తర్వాత ప్రజలు తమకు పట్టం కట్టారని అన్నారు.

మేము ప్ర‌జ‌ల‌ అంచనాలకు అనుగుణంగా జీవించాలని అల్లాను ప్రార్థిస్తాము. ఇక్కడ 'పోలీసు పాలన' కాదు ప్రజల పాలన ఉంటుంది. అమాయకులను జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం. మీడియా స్వేచ్ఛగా ఉంటుంది. హిందువులు, ముస్లింల మధ్య విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రజలు తమ ఆదేశాన్ని ఇచ్చారు. ఆగస్టు 5న (ఆర్టికల్ 370 రద్దు) తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని నిరూపించారు. ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్న పోరాటంలో కూటమి భాగస్వాములు సహాయపడతాయ‌ని మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ట్రెండ్స్ ప్రకారం.. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి కేవలం రెండు సీట్లు మాత్రమే రావచ్చు. ఒమర్ అబ్దుల్లా ఇంతకుముందు 2009 నుండి 2015 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Next Story