పండ్లు అమ్ముకొనే వ్యక్తికి పద్మశ్రీ

By అంజి  Published on  28 Jan 2020 1:10 PM IST
పండ్లు అమ్ముకొనే వ్యక్తికి పద్మశ్రీ

మనకు సమస్య వచ్చినప్పుడే సమస్య గురించి ఆలోచిస్తాం, బాధ కలిగినప్పుడే బాధకు కారణం అన్వేషిస్తాం. ఇబ్బందులు లేని జీవితంలోకి వచ్చేసరికి అవన్నీ మరచిపోయి రొటీన్లో పడిపోతాము. అలాగే ఆలోచిస్తే అతనికి పద్మశ్రీ వచ్చి ఉండేది కాదు. జస్ట్ ఒక పండ్లు అమ్ముకొనే వ్యక్తిగా మిగిలిపోయేవాడు.

దక్షిణ కర్నాటకలో అది ఓ చిన్న గ్రామం న్యూపడ్పు. గ్రామానికి చెందిన హజబ్బా నిరక్షరాస్యుడు, ఈ నిరు పేద వ్యాపారిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ' పద్మశ్రీ ' అవార్డు వరించిందంటే నమ్మలేం..కానీ అది నిజం.

Harekala Hajabba

పండ్లు ఖరీదు అడిగిన విదేశీ జంటకు సమాధానం చెప్పలేకపోయాను అన్నా అతని బాధ నుంచి పుట్టిన ఆలోచన తన ఊరిలోని పిల్లల కోసం బడి కట్టడం. మొదట ఎవరి అండనూ కోరుకోకుండానే స్కూలు కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు హజబ్బా. అయితే స్కూలు కట్టించడానికి తాను పొదుపు చేసిన డబ్బు సరిపోదని అర్థమైంది. దాంతో గడపా గడపా తిరుగుతూ తోచిన సహాయం చేయమని కోరేవాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.

Harekala Hajabba

అయినాసరే నిరాశ పడలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విషయం పదిమంది దృష్టిలో పడింది. స్థానిక దినపత్రికలో హజబ్బా మీద స్ఫూర్తిదాయక కథనం వచ్చింది. ఒక జాతీయ ఛానల్ వాళ్లు ‘రియల్ హీరోస్’ అవార్డును ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన అయిదు లక్షల్ని కూడా స్కూలు కోసమే వెచ్చించాడు హజబ్బా. దీంతో మొదట నవ్విన వాళ్లందరికీ అతడి నిజాయితీ అర్థమైంది.. హజబ్బా నిర్మించిన స్కూలు తరువాత సెకెండరీ స్కూల్‌గా మారింది. స్కూలు కట్టించడం వరకే నా పని అంటూ ఆ స్కూలును ప్రభుత్వపరం చేశాడు హజబ్బా. స్కూలుకు తన పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా తిరస్క రించాడు.

Harekala Hajabba

ఎంతో మంది పేద పిల్లలకు చదువును అందిస్తున్న హజబ్బాను మంగళూరు వాసులు ముద్దుగా ‘అక్షర శాంత’ గా పిలుచుకుంటారు. ఆయన జీవిత విశేషాలను మంగళూరు యూనివర్సీటీలో సిలబస్‌గా పెట్టారు. కేరళలోని కర్ణాటక మీడియం పాఠశాలలలో ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు.

తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జాతీయం స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. చాలా మాములుగా తన పని తాను చేసుకు పోతున్నాడు.

Next Story