పాండ్యాను త‌ప్పించ‌డానికి వెనుకున్న కార‌ణ‌మిదేనా..?

By Newsmeter.Network  Published on  13 Jan 2020 1:38 PM GMT
పాండ్యాను త‌ప్పించ‌డానికి వెనుకున్న కార‌ణ‌మిదేనా..?

టీమిండియాలో దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ త‌రువాత అంత‌టి ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆట‌గాడు హార్థిక్ పాండ్యా. వెన్నుముక గాయంతో నాలుగు నెల‌ల పాటు క్రికెట్‌కు దూర‌మైన ఈ క్రికెట‌ర్ ఇటీవ‌లే కోలుకున్నాడు. ఇక న్యూజిలాండ్ తో సిరీస్ కి మ‌నోడి ఎంపిక లాంఛ‌న‌మే అనుకున్న త‌రుణంలో అభిమానుల‌కు షాకిచ్చింది బీసీసీఐ. అంతేకాదు న్యూజిలాండ్ తో టిండియా సిరీస్ కు ముందు షాడో టూర్ గా భార‌త-ఏ జ‌ట్టును పంపుతారు. భార‌త-ఏ జ‌ట్టు కు ముందు మ‌నోడిని ఎంపిక చేసిన త‌రువాత పాండ్యా ను త‌ప్పించి విజ‌య్ శంక‌ర్ కు అవ‌కాశం ఇచ్చింది.

దీంతో అభిమానుల్లో గంద‌ర గోళం నెల‌కొంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పాండ్యా పూర్తిగా కోలుకోలేదా..? ఫిట్ నెస్ టెస్టులో విఫ‌లం అయ్యాడా..? అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. పాండ్యాకు చోటు దక్కకపోవడం వెనక పలు కారణాలు ఉన్నట్టు బీసీసీఐ వర్గాలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా వెన్నముక గాయంతో బాధపడి కోలుకున్న తర్వాత జట్టులోకి రావాలంటే అధిక తీవ్రతతో కూడిన బౌలింగ్ సెషన్‌ టెస్టును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, నిద్రలో లేపి చేసినా యో-యో టెస్టులో పాస్ కావాల్సి ఉంటుంది.

వెన్నెముకకు జరిగిన శస్త్రచికిత్స నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాండ్యా ప్రస్తుతం వీటిని ఎదుర్కొని టెస్టులో పాస్ కావడం కష్టం. కాబట్టే అతడికి మరింత సమయం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నాటికి గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఆ సిరీస్‌కు పాండ్యా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story