హ్యాపీ బ‌ర్త్‌డే హిట్‌మ్యాన్‌.. నీ విధ్వంసం ఇలానే సాగ‌నీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2020 2:29 PM GMT
హ్యాపీ బ‌ర్త్‌డే హిట్‌మ్యాన్‌.. నీ విధ్వంసం ఇలానే సాగ‌నీ

టీమ్ఇండియా ఓపెన‌ర్‌, ప‌రిమిత ఓవ‌ర్ల వెస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నేడు(గురువారం) 33వ ప‌డిలోకి అడుగుపెట్టాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన హిట్‌మ్యాన్‌.. భార్య‌-కూతురితో క‌లిసి పుట్టిన రోజు వేడుక‌ల్ని జ‌రుపుకుంటున్నాడు. ఇక రోహిత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), ఐసీసీ, భార‌త క్రికెట‌ర్లుల‌తో పాటు నెటీజ‌న్లు హిట్‌మ్యాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

మూడు ద్విశ‌త‌కాలు సాధించిన ఏకైక ఆట‌గాడు..

2007లో భార‌త జ‌ట్టులో అరంగ్రేటం చేశాడు రోహిత్‌శ‌ర్మ‌. అయితే.. మొద‌ట్లో త‌న స్థానం పై భ‌రోసా ఉండేది కాదు. చాలా క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు. ఒకానొక ద‌శ‌లో హిట్‌మ్యాన్ కెరీర్ ముగిసింద‌నే వార్త‌లు వినిపించాయి. ఆ ద‌శ‌లో భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని.. రోహిత్‌ను ఓపెన‌ర్‌గా పంపిన ప్ర‌యోగం ఫ‌లించింది. అప్ప‌టి వ‌ర‌కు మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడిన ఈ ఆట‌గాడు ఓపెన‌ర్‌గా 2013లో జ‌రిగిన ఛాంపియ‌న్ ట్రోఫీని భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో ఇక త‌న కెరీర్‌లో రోహిత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. వ‌న్డేల్లో ఎవ్వ‌రికి సాధ్యం కాని విధంగా మూడు డ‌బుల్ సెంచ‌రీలు బాదిన హిట్‌మ్యాన్‌.. టీ20ల్లో ఏకంగా నాలుగు సెంచ‌రీలు చేశాడు. వ‌న్డేల్లో అరంగ్రేటం చేసిన ఆరేళ్ల‌కు గానీ రోహిత్‌కు టెస్టుల్లో ఆడే అవ‌కాశం రాలేదు. ఇక టెస్టుల్లో కూడా త‌న స్థానం ప్ర‌శ్నార్థ‌క‌మే అయ్యింది. వ‌న్డేల్లో మాదిరిగానే టెస్టుల్లో ఓపెన‌ర్‌గా పంపడంతో.. త‌నలోని అస‌లైన క్రికెట్‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశాడు.

2019.. హిట్‌మ్యాన్ సంవ‌త్స‌రం

2019 మొద‌ట్లో హిట్‌మ్యాన్‌కు కూతురు స‌మైరా జ‌న్మించింది. 2018 చివ‌ర‌ల్లో టెస్టుల్లో ఓపెన‌ర్ గా ప్ర‌మోష‌న్ పొందిన హిట్‌మ్యాన్‌.. 2019లో త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు. ఆ ఏడాది అంతా అన్ని ఫార్మాట్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 405 ప‌రుగులు చేశాడు. అద్భుత నాయకత్వంతో ముంబై ఇండియన్స్‌ జట్టును ముందుండి నడిపించాడు. ఉత్కంఠభ‌రితంగా జ‌రిగిన ఫైనల్ మ్యాచ్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబైని విజేతగా నిలిపాడు. దీంతో ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది. ఆత‌రువాత ఇంగ్లాండ్ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్‌లో హిట్‌ను విధ్వంసం సృష్టించాడు. ఏకంగా ఐదు శ‌త‌కాలతో చెల‌రేగాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు 364 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 14,029 ప‌రుగులు చేశాడు. ఇందులో 39 సెంచ‌రీలు ఉ్న‌నాయి. అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్ల‌లో 423 సిక్స‌ర్ల‌తో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. 534 సిక్స‌ర్ల‌తో క్రిస్ గేల్ మొద‌టి స్థానంలో ఉండ‌గా.. 476 సిక్స‌ర్ల‌తో ఆఫ్రిది రెండో స్థానంలో ఉన్నాడు. గ‌త మూడేళ్లుగా అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్న రోహిత్‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 217 సిక్స‌ర్లు బాదాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు సాధించాడు.

బ్రాండింగ్ లోనూ..

ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగడంతో రోహిత్ శర్మ బ్రాండ్‌ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. రోహిత్‌ ప్రస్తుతం దాదాపు 20కి పైగా వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఏడాదికి సుమారు రూ.75 కోట్లకు పైనే సంపాదిస్తాడట. పలు బ్రాండ్‌ వస్తువులకు యాడ్‌ షూటింగ్‌లో పాల్గొనాలంటే రోజుకు కనీసం రూ.ఒక కోటి తీసుకుంటాడని సమాచారం.

రోహిత్‌ శర్మ పేరిట ఉన్న కొన్ని రికార్డులు..

  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడు
  • వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు -264 ప‌రుగులు
  • వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌
  • ఇంగ్లాండ్‌‌ గడ్డపై హ్యాట్రిక్‌ శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ దీన్ని సాధించాడు.
  • ఒక వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యధిక సెంచరీలు(5)
  • వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోలో ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు(3)
  • ఓ క్యాలెండర్ ఇయ‌ర్‌లో 7 జ‌ట్ల‌పై శ‌త‌కాలు బాదిన తొలి క్రికెట‌ర్‌. 2019లోనే ఈ ఘ‌న‌త సాధించాడు.

Next Story