దోషులను 30 నిమిషాల పాటు ఉరి తీశాం: జైలు అధికారులు
By సుభాష్
ఎట్టకేలకు నలుగురు నిర్భయ దోషులను తీహార్ జైల్లో ఉరి తీశారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జైలు నంబర్ 3లో ఉరి శిక్షను అమలు చేశారు. ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. దోషులు రాత్రంతా నిద్రలేకుండా గడిపారని తెలిపారు. గత రాత్రి భోజనం కూడా చేయలేదని, ఉరి తీసే గంట ముందు బ్రేక్‌ఫాస్ట్ కు నిరాకరించారని చెప్పారు. ఉరికి ఒక రోజు ముందు అంటే గురువారం వారిని విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచామన్నారు. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు వారు నిద్ర లేచారని, స్నానాలు చేయాలని కోరగా, ఎవరూ అంగీకరించలేదని అన్నారు.
దోషులకు 30 నిమిషాల పాటు ఉరి
నలుగురు దోషులకు 30 నిమిషాల పాటు ఉరి తీశామని జైలు అధికారులు చెప్పారు. ఉరి అమలు సందర్భంగా జైలంతా లాక్‌డౌన్‌లో ఉంచామని, భారీ భద్రతా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక జైల్లో పవన్ గుప్తా, వినయ్, ముఖేష్, అక్షయ్‌లు జైల్లో పని చేశారని, వారు సంపాదించిన మొత్తం ఆయా కుటుంబ సభ్యులకు అందజేస్తామని అన్నారు. ఇదిలాఉంటే ఉరి అమలుకు ముందు వినయ్ కుమార్ ఉరి వేయవద్దని పోలీసులను వేడుకున్నట్లు తెలిసింది.