భారతీయులకు అమెరికా హెచ్1-బి షాక్?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2020 11:46 AM GMT
భారతీయులకు అమెరికా హెచ్1-బి షాక్?

కరోనాను మహమ్మారి అని ఊరికే ప్రకటించలేదు డబ్ల్యూహెచ్వో. ఈ వైరస్ కేవలం ఆరోగ్య పరంగానే కాదు.. అన్ని రకాలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల అనారోగ్యంతో చనిపోయే వారి కంటే.. ఆర్థికంగా పరిస్థితులు తలకిందులై ప్రాణాలు కోల్పోయే, రోడ్డున పడే వారి సంఖ్య ఎక్కువగా ఉండబోతోందన్న నిపుణుల మాటలు నిజమే అని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది మంది కరోనా కారణంగా ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. మళ్లీ ఎప్పుడు పరిస్థితులు బాగుపడతాయో తెలియట్లేదు. అగ్ర రాజ్యం అమెరికా కరోనా దెబ్బకు కుదేలైంది. అక్కడ కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. తమ దేశానికి చెందిన కోట్ల మంది రోడ్డున పడ్డ నేపథ్యంలో ట్రంప్ సర్కారు వారిని రక్షించడం కోసం వలసదారులకు షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది.

తమ వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా పలు రకాల ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలం పాటు నిలిపివేసే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు అక్కడి ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటున్న విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది వృత్తిపరమైన నిపుణులకు ఇచ్చే వలసేతర వీసా అయిన హెచ్‌-1బీపైనే ఉంటున్నారు. తాజాగా ట్రంప్‌ నిలిపివేయాలనుకుంటున్న ఉద్యోగ వీసాల్లో ఇది కూడా ఉన్నట్లు ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పేర్కొంది.

కరోనా కారణంగా చాలా మంది హెచ్‌-1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయి భారత్‌కు తిరిగొచ్చారు. అమెరికా తాజా నిర్ణయం అమలైతే వీరు తిరిగి వెళ్లాలన్నా.. కొత్తగా ఎవరైనా అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకున్నా కొంతకాలం పాటు సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అమెరికాలో హెచ్1బి వీసాపై ఉంటున్నవారు కూడా బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఫైర్ చేస్తారో తెలియట్లేదు. వేటు పడగానే దేశం వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది.

Next Story