హెచ్-1 బి వీసా ఉన్న భారతీయులకు కొత్త కష్టాలు..!

By సుభాష్  Published on  3 April 2020 5:39 AM GMT
హెచ్-1 బి వీసా ఉన్న భారతీయులకు కొత్త కష్టాలు..!

కరోనా వైరస్.. ప్రతి దేశాన్ని ఆర్థికంగా కుదిపేస్తోంది. ప్రపంచ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. స్టాక్ మార్కెట్లు భారీ పతనాలను చవిచూశాయి. కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే కొన్ని కంపెనీలు మూసివేయాల్సి ఉంటుంది.

కోవిద్-19 కారణంగా ఎన్నో కంపెనీలు ఆర్థికంగా ఎదురుదెబ్బలు తింటున్నాయి. దీని కారణంగా ఎంతో మంది భారతీయలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. హెచ్-1 బి వీసా ఉన్నవాళ్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా లోని కంపెనీలు ఆర్థిక భారం భరించలేక మ్యాన్ పవర్(ఉద్యోగుల సంఖ్య) ను తగ్గించుకోవాలని అనుకుంటే హెచ్ 1-బి వీసా మీద పని చేస్తున్న భారతీయుల ఉద్యోగాలు రిస్క్ లో ఉన్నట్లేనని అంటున్నారు. అమెరికా-భారత్ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా కంపెనీలపై పడుతున్న ఆర్ధిక భారం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న వివిధ దేశాలకు చెందిన 3.4 కోట్ల మందిపై ప్రభావం చూపనుంది. అక్కడి నిబంధనల ప్రకారం హెచ్-1 బి వీసా మీద వెళ్లిన వాళ్ళ వీసా ఎక్స్పైరీ అయితే 60 రోజుల్లో తిరిగి వారి దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉంటే వారిపై ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్(అక్రమ వలసదారులు) అనే ముద్ర పడుతుంది.

హెచ్-1 బి వీసా దారులు మాత్రం ఆ సమయాన్ని 180 రోజులకు పొడిగించాలని అంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలో వేరే ఉద్యోగాన్ని సంపాదించుకోవడం కానీ.. లేదంటే భారత్ కు తిరిగి వెళ్లడం వంటివి చేయొచ్చు అని అంటున్నారు. 80000 మందికి పైగా ఇప్పటికే ఈ పిటీషన్ లో సంతకాలు చేశారు. లక్ష మంది కంటే ఎక్కువ సంతకాలు చేస్తేనే ఈ పిటీషన్ గురించి వైట్ హౌస్ పరిగణలోకి తీసుకుంటుంది. శుక్రవారం నాటికి లక్ష సంతకాలు పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో వివిధ వీసాలతో పనిచేస్తున్న చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలను కోల్పోయారు. హెచ్ 1 బి వీసా ఉండి దాన్ని పొడిగించుకోవాలని భారత్ కు వచ్చిన వాళ్ళు.. ఇంతకూ అమెరికాకు తాము వెళితే అక్కడ మా ఉద్యోగాలు ఉంటాయా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కరోనా వైరస్ ప్రభావం కారణంగా అమెరికా భారత్ కు చెందిన అన్ని వీసా ప్రాసెస్ లను ఆపివేసింది. ఐబీఎం లాంటి కంపెనీలు భారత్ లోని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యోగులు తమను హైదరాబాద్ బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ చేయాలని కోరాయి.. దానిపై ఇంకా కంపెనీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమైన కరోనా మహమ్మారిని చైనా ప్రపంచం మీదకు వదిలిందని అమెరికా వాదిస్తోంది. ముఖ్యంగా అమెరికా మీద చైనా చేసిన బయో వార్ ఇదని అక్కడి వాళ్ళు నమ్ముతున్నారు. అమెరికాలో రోజు రోజుకీ కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతోంది. చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఒక మిలియన్ అమెరికన్లకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని.. ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తెలిపారంటే అమెరికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు.

Next Story