రేషన్ కార్డులు రద్దైన కుటుంబాల పరిస్థితి ఏంటి..?

By సుభాష్  Published on  3 April 2020 4:36 AM GMT
రేషన్ కార్డులు రద్దైన కుటుంబాల పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేషన్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. రేషన్ సరుకులు తీసుకోవాలన్నా.. ప్రభుత్వం నుండి సహాయాన్ని తీసుకోవాలన్నా రేషన్ కార్డులు చాలా ముఖ్యం. కానీ తెలంగాణలో రేషన్ కార్డులు లేని వారు ప్రస్తుతం టెన్షన్ పడుతూ ఉన్నారు.

హైదరాబాద్ లో 85 శాతం రేషన్ కార్డులను కొద్ది రోజుల కిందట తెలంగాణ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. తెలంగాణ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందించిన డేటా ప్రకారం.. వాళ్ళు పొందుపరిచిన ఆధార్ సీడింగ్ డేటా ద్వారా 20.6 లక్షల రేషన్ కార్డులను హైదరాబాద్ లో ఇవ్వగా.. వాటిలో 17.6 లక్షల రేషన్ కార్డులను రిజెక్టెడ్ క్యాటగిరీలో ఉంచారు.

తెలంగాణ సివిల్ సప్లైస్ కమీషనర్ సత్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇది ఇప్పుడు జరిగింది కాదని అన్నారు.

ఇటీవలి కాలంలో తామెవరి రేషన్ కార్డులను రద్దు చేయలేదని ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులను ఇవ్వాల్సి ఉందని అన్నారు. బోగస్ కార్డులను ఎత్తివేసి.. కొత్త రేషన్ కార్డులను తాము ఇవ్వాలని సంకల్పించామని ఆయన అన్నారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన డేటా ప్రకారం దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా బోగస్ రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసిన రాష్ట్రం తెలంగాణనే..! ఇప్పుడు అలా క్యాన్సిల్ అయిన రేషన్ కార్డు దారులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చాలా కుటుంబాలకు తమ రేషన్ కార్డు క్యాన్సిల్ అయింది అన్న విషయం కూడా తెలీదు. కోవిద్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో రేషన్ కార్డు అన్నది దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వాళ్లకు ఎంతో అవసరం. రేషన్ సరుకులు పొందడానికి, ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం పొందడానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఇలా రద్దు చేసి ఉండడం.. కొత్త కార్డులు రాకపోవడం ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది.

అహ్మద్ ఖాన్, ఫతేహ్ దర్వాజా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇటీవల రేషన్ తీసుకోడానికి వెళ్ళినప్పుడు నీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయిందని చెప్పారట. గతంలో అధికారులు చెప్పినట్లే తాను ఆధార్ ను లింక్ చేశానని.. కానీ గత నెలలో తన కార్డు బ్లాక్ అయిందట.. కానీ ఇప్పటి వరకు నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదని అహ్మద్ ఖాన్ చెబుతున్నాడు. తన కార్డు రద్దవ్వడానికి కారణం కూడా ఎవరూ చెప్పలేదని.. అంతా అయోమయంగా ఉందని అన్నాడు. అహ్మద్ ఖాన్ ఎంబ్రాయిడరీ పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నాడు.

అలీబాగ్ కు చెందిన ఫాతిమా బేగం పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే..! ఆమె కార్డు కూడా క్యాన్సిల్ అయింది.. కానీ అందుకు కారణం మాత్రం ఎవరూ చెప్పలేదు. హుస్సేనీ ఆలమ్ లోని రేషన్ కార్డు ఆఫీసులో అధికారులను తాము కలవాలని అనుకున్నా వీలుపడడం లేదని.. అధికారులు తమ కార్డును ఎందుకు రద్దు చేశారో కూడా తెలీదని ఫాతిమా కుమారుడు అలీ బిన్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.

కార్డులను రద్దు చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయని అన్నారు సివిల్ సప్లైస్ కమీషనర్. ఉదాహరణకు కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, కుటుంబం నుండి ఎవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

అలాంటి సమయంలో అధికారులను సంప్రదించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వీలు కాదని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు చెప్పారు.

Next Story