ఇరాన్‌కు అగ్రరాజ్యం పెద్దన్న హెచ్చరిక

By సుభాష్  Published on  2 April 2020 7:07 AM GMT
ఇరాన్‌కు అగ్రరాజ్యం పెద్దన్న హెచ్చరిక

అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మృతుల సంఖ్య, పాజిటివ్‌ కేసుల సంఖ్య గంట గంటకు పెరుగుతుండటంతో ట్రంప్‌కు పెద్ద సమస్యగా మారింది. ఇక ఈ విషయం పక్కనపెడితే.. ఇరాన్‌పై ట్రంప్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇరాన్‌లోని అమెరికా సైనిక బలగాలపై, ఆస్తులపై దాడులు చేసేందుకు ఇరాన్‌ వ్యూహాలు రచిస్తోందని, అలాంటివి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. బుధవారం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ఇరాన్‌లోని తమ ఆస్తులపై, బలగాలపై దాడిచేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తమకు సమాచారం అందిందని, అదే కనుక జరిగితే ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కాగా, అమెరికా- ఇరాన్‌ల మధ్య కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జనవరి 4న బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా జరిపిన రాకెట్‌ దాడులలో ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ మృతి చెందడం ఇందుకు కారణమనే చెప్పాలి. అయితే అక్కడి ప్రాంతంలోని అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించారని, వందమంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మరణానికి ఆయన కారణమైనందున దాడి చేసినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సులేమానీ హతమైన తర్వాత ఇరాన్‌ అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడిపోయింది. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం కూడా చేసింది. అప్పటి నుంచి అమెరికాపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు.

Next Story