దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు, ప్ర‌ముఖులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ నిందితుల ప‌ట్ల‌ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును చాలామంది ప్ర‌ముఖులు కొనియాడుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్‌, రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ హైదరాబాద్‌ పోలీసులను మెచ్చుకున్నారు. గ్రేట్ వ‌ర్క్ అంటూ తెలంగాణ పోలీసులను ప్ర‌శంచించారు.

దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై మ‌రో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ఈ విష‌య‌మై తెలంగాణ పోలీసులను జ్వాలా ‘ముఖ్యమైన ప్రశ్న’ అంటూ ప్రశ్నించారు. భవిష్యత్తులో దిశ వంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే.. ప్రతీ రేపిస్టుకు ఇటువంటి శిక్ష‌లే అమలు చేయాలన్నారు. సమాజం పట్ల బాధ్యత లేకుండా ఇటువంటి ఘటనలకు పాల్పడే వారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు ప‌డుతుందా..? అత్యాచారానికి పాల్పడిన ప్రతీ ఒక్కర్నీ ఇలాగే శిక్షిస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హ‌త్య‌ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా ఒక్క‌సారిగా పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆత్మ‌ర‌క్ష‌ణ‌పై కాల్పులు జ‌రిపిన పోలీసులు నిందితుల‌ను మ‌ట్టుబెట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.