గుంటూరు మిర్చికి 'కరోనా' ఘాటు.!

By అంజి  Published on  4 Feb 2020 7:01 AM GMT
గుంటూరు మిర్చికి కరోనా ఘాటు.!

కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని మామూలుగా వణికించడం లేదు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవహారాలపై కూడా పడుతోంది. అలాగే భారతదేశంలోనే అతి పెద్ద మిర్చి యార్డు అయిన గుంటూరు మిర్చి మార్కెట్ మీద కరోనా వైరస్ ప్రభావం పడింది. గుంటూరు, తేజస్ వెరైటీ మిర్చి ధరలు దాదాపు 50 శాతం పైగా పడిపోయాయి. కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో చైనా ఇతర దేశాల నుండి దిగుమతులను భారీగా తగ్గించేసింది. దీంతో ఈ ప్రభావం గుంటూరు మిర్చి యార్డుపై పడింది. చైనా భారత్ నుండి మిర్చిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి.. ప్రస్తుతం దిగుమతులను ఆపివేయడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రైతులు భారీగా నష్టపోనున్నారు.

గత కొద్ది రోజుల్లోనే క్వింటాల్ మిర్చి ధర 5,000 నుండి 7000 రూపాయల వరకూ పడిపోయింది. కొద్ది రోజుల వరకూ మార్కెట్ లో 9000 నుండి 12000 రూపాయలు పలికింది. కానీ ఇప్పుడు ఆ ధర పలకపోవడంతో మిర్చి రైతుల్లో టెన్షన్ మొదలైంది. చైనా, బంగ్లాదేశ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వలన డిసెంబర్ నెలలో తేజ వెరైటీ మిర్చి ధర 16000 నుండి 20000 వరకూ పలికింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం మిర్చి రైతులను కలవరపెట్టే అంశం. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో మార్కెట్ యార్డు వ్యాపారులు ఉన్నారు. వీలైనంత త్వరగా చైనా దిగుమతులపై ఉన్న అనధికార నిషేధాన్ని ఎత్తివేస్తే చాలని అంటున్నారు.

భారత్ నుండి ప్రతి ఏడాది 6000 నుండి 7000 కోట్ల రూపాయల ఎగుమతులు చైనాకు జరుగుతుంటాయి. భారత వాటా దాదాపు 60 శాతం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి 5000 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతులు సింగపూర్, బాంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్ లాండ్, పాకిస్థాన్ దేశాలు ఎక్కువగా మిర్చి దిగుమతి చేసుకుంటున్నాయి.

Next Story