ఏపీ యువకుడికి ఈజిప్టులో ఉరిశిక్ష.. కాపాడడంటూ కన్నతల్లి మొర.. అసలేమయ్యింది.?

By అంజి  Published on  24 Nov 2019 11:33 AM GMT
ఏపీ యువకుడికి ఈజిప్టులో ఉరిశిక్ష.. కాపాడడంటూ కన్నతల్లి మొర.. అసలేమయ్యింది.?

శ్రీకాకుళం: ఎజెంట్‌ని నమ్మి విమానమెక్కాడు.. ఉపాధి కోసం దేశం కానీ దేశం వెళ్లాడు. షిప్‌లో ఉద్యోగం అనడంతో పొంగిపోయిన ఆ యువకుడికి విదేశంలోగట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ యువకుడికి విదేశంలో ఉరిశిక్ష పడడం చంద్రయ్యపేటలో కలకలం రేపుతోంది. ఇంటర్‌ చదివిన రమణ.. విదేశాల్లో ఉద్యోగాలున్నాయని తెలుసుకొని విశాఖపట్నంలోని ఎస్‌కేడీ కంపెనీకి చెందిన ఎంజెట్‌ వర్మకు బ్రోకర్‌ రూ.4 లక్షలు ఇచ్చాడు. 2016 సెప్టెంబర్‌లో ఎజెంట్‌ శ్రీహర్షవర్మ రమణను ముంబై నుంచి ఇరాన్‌ ఫ్లైట్‌ ఎక్కించాడు.

అక్కడ ఏజెంట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అబ్బాన్‌ సిరదౌసీ కంపెనీకి చెందిన షిప్‌లో రమణ సీమెన్‌గా చేరాడు. అయితే ఆ షిప్‌లలో తరచూ డ్రగ్స్‌ సరఫరా జరుగుతుందని తెలియని రమణ.. ఆ షిప్‌లో మూడు నెలల పాటు పని చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో ఇరాన్‌ నుంచి ఈజిప్టుకు షిప్‌ వస్తుండగా కోస్ట్‌గార్డులు పట్టుకున్నారు. షిప్‌లో భారీగా కోస్ట్‌గార్డు పోలీసులు భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా షిప్‌లో ఉన్న సిబ్బందితో పాటు రమణను కూడా ఈజిప్ట్‌ కోస్ట్‌ గార్డు పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మూడేళ్ల పాటు జైలులో ఉన్న రమణ

మూడేళ్ల పాటు జైలులో ఉన్న రమణ.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ కేసులో ఈజిప్టు స్థానిక కోర్టు రమణకు ఉరిశిక్ష విధించిందని తెలుస్తోంది. రమణ విదేశాలకు వెళ్లిన నాటి నుంచి అతని ఆచూకీ, వివరాలు తెలియరాలేదు. దీంతో సంబంధిత ఏజెంటుని రమణ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఈ నెలఖారులో వస్తాడు.. అప్పుడొస్తాడూ, ఇప్పుడొస్తాడూ అంటూ దాటవేస్తూ వచ్చాడు. రమణ అరెస్ట్‌ అయ్యాక కూడా తమకు ఫోన్లు వచ్చాయని, ఏజెంట్‌ వర్మ వేరే వాళ్లతో ఫోన్‌ చేయించి తమను మోసం చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మా అన్న రమణ మాతో రెండు నెలలకు ఒకసారి మాట్లాడేవాడని.. చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టు 20 న మాట్లడాడని రమణ చెల్లెలు తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఫోన్‌ రాలేదని పేర్కొంది.

కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ వినతిపత్రం

దీంతో జులై నెలలో రమణ తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రమణ ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. ఇదే విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల వద్దకు తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఎన్నారై విభాగం రమణ కోసం ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో ఎన్నారై విభాగంకు వచ్చిన సమాచారం ప్రకారం.. రమణను ఈజిప్టు పోలీసులు అరెస్ట్‌ చేశారని.. అక్కడి స్థానిక కోర్టు అతనికి ఉరిశిక్ష విధించిందని తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

స్పందించిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఇంత జరుగుతున్న స్థానిక అధికారులకు ఈ విషయం తెలియరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. గురువారం రోజున బాధితులు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ద్వారా విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈజిప్టు ప్రభుత్వంతో మాట్లాడి.. రమణ క్షమాభిక్ష పెట్టెలా చేయాలని వేడుకున్నారు. ఇందులో రమణ తప్పేమి లేదని... షిప్‌ యాజమాన్యం తప్పుల వల్లే రమణ చిక్కుకున్నాడని బాధితులు వాపోతున్నారు. రమణను ఎలాగైన భారత్‌ రప్పించాలని కోరారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

Next Story