ఆదుకుంటా అని హామీ ఇచ్చారు.. ఇప్పుడెమో తప్పుకుంటున్నారు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 2:04 PM ISTహైదరాబాద్: ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారు.. ఆదుకుంటా అని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రభుత్వం తప్పుకుంటొందని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ సమ్మె నేటితో 25 రోజులకు చేరుకుంది. సమ్మెలో ఇప్పటి వరకు 28 మంది వివిధ కారణాలతో చనిపోయారన్నారు. సంస్థకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వలేదని కోర్టుకు వివరించామని థామస్ రెడ్డి తెలిపారు. ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి.. ఇతరులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని థామస్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ, తెలంగాణ విడిపోలేదని.. సంస్థలు కలిసే ఉన్నాయన్నారు. సర్వీసులు కూడా కలిపే ఉన్నందున.. అక్కడ చేసిన విధంగా ఇక్కడ చేయ్యాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. పల్లెవెలుగు నష్టాలు ప్రభుత్వమే భరించాలని థామస్‌రెడ్డి అన్నారు. నష్టాలు భరించలేక పోతే సంస్థకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. ఇది ప్రజాస్వామ్యామా.. పోలీసు రాజ్యమా అంటూ థామస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. సమ్మెకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు థామస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా ఉద్యమాలు- ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం నేత దామోదర్
నిజాం హయాంలో ఆర్టీసీ సంస్థ ప్రారంభమైంది. రాష్ట్ర విభజనకు ముందు అనేక ఉద్యమాలు చేశామన్నారు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత దామోదర్. సమ్మె చేస్తున్న కార్మికులకు అండగా ఉంటామన్నారు. అవసరం అయితే ప్రత్యేక్ష పోరాటం కూడా చేస్తామని దామోదర్ అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేసుకోవాలని కమిటీ వేశారు. ఆ పని మీరెందుకు చేయడం లేదన్నారు. జీతభత్యాల్లో చాలా తేడా ఉంటుంది. ఇక్కడి కార్మికులు చేస్తున్న ఉద్యమాలకు సంఘీభావంగా ఏపీలోనూ ఉద్యమాలు చేస్తున్నామని ఏపీ ఆర్టీసీ కార్మిక నేత దామోదర్ అన్నారు. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని.. బలవన్మరణాలకు పాల్పడొద్దని సూచించారు.
కార్మికుల ఆత్మహత్యలు బాధకరం.. - ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు
ఆర్టీసీతోనే ప్రజలకు చవకైన ప్రయాణం సాధ్యమవుతుందని ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు అన్నారు. ఇక్కడ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఏపీలో కూడా జేఏసీగా ఏర్పాటై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. కార్మికుల ఆత్మహత్యలు బాధకరం.. ఎక్కడైనా పోరాటంలో కార్మికులదే విజయమన్నారు. జాతీయ ఫెడరేషన్ కూడా ఆందోళనకు సిద్ధమవుతోందని వైవీ రావు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి వీలైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో ఛలో తెలంగాణ కార్యక్రమం చేపడుతామని కార్మిక సంఘం నేత వైవీ రావు అన్నారు.