డాక్టర్ కాపర్ బాటిల్స్ మాజీ ఎం.డి అరెస్ట్   

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Dec 2019 7:45 AM GMT
డాక్టర్ కాపర్ బాటిల్స్ మాజీ ఎం.డి అరెస్ట్    

ముఖ్యాంశాలు

  • డాక్టర్ కాపర్ మంచినీళ్ల సీసాల కంపెనీలో జి.ఎస్.టి స్కామ్
  • త‌ప్పుడు బిల్లులు, ఇన్వాయిస్ లను సృష్టించిన కంపెనీ
  • ఇన్ పుట్ క్రెడిట్ రూపంలో పన్నులు ఎగ్గొట్టిన కంపెనీ
  • లాభాలను పెంచి చూపించేందుకు తప్పుడు మార్గాలు
  • కంపెనీ పూర్వ ఎం.డి కె.వి.రాజశేఖర్ రెడ్డి అరెస్ట్
  • జి.ఎస్.టి స్కామ్ బయటపడ్డ తర్వాత ఎం.డి రాజీనామా
  • కేసు బుక్కైన తర్వాత కంపనీ నుంచి తప్పుకున్న ఎం.డి

హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ జి.ఎస్.టి ఇంటెలిజెన్స్ అధికారులు డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్స్ తయారీ కంపెనీ ఎం.ఎస్.ఆర్ ఇండియా లిమిటెడ్ పూర్వ మానేజింగ్ డైరెక్టర్ కె.వి.రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జి.ఎస్.టి ఎగ్గొట్టేందుకు తప్పుడు ఇన్వాస్ లను సృష్టించినందుకుగానూ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు.

డాక్టర్ కాపర్ పేరుతో రాగి మంచినీళ్ల సీసాలను తయారుచేసే ఈ కంపెనీ ఫేక్ ఇన్వాయిస్ లను సృష్టించి స్కామ్ లో ఇరుక్కుంది. 2019 మార్చ్ నెలలో ఈ కంపెనీమీద జి.ఎస్.టి కేసు బుక్కైన తర్వాత ఆయన తన పదవీబాధ్యతలనుంచి, కంపెనీనుంచి తప్పుకున్నారు.

బాచుపల్లిలో జీడిమెట్లలో తయారీ ప్లాంట్లను కలిగి ఉన్న ఈ కంపెనీ కొన్ని డిఫెన్స్, ఏవియేషన్ రంగ సంస్థలకు చాలా కాలంగా ఈ సీసాలను సరఫరా చేస్తోంది. ప్రస్తుతానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డులో నలుగురు సభ్యులున్నారు. బ్యాలెన్స్ షీట్లలో లాభాలను పెంచి చూపించేందుకు ఉద్దేశపూర్వకంగా రాజశేఖర్ రెడ్డి తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి అమ్మకాలను లెక్కల్లో చూపించినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం.

దాదాపుగా రూ.38 కోట్ల రూపాయల లాభాన్ని లెక్కల్లో చూపించేందుకు కంపెనీ ఈ పనిచేసినట్టుగా, రాజశేఖర్ రెడ్డి ఆదేశాలమేరకే ఉద్దేశపూర్వకంగా ఈ నేరం జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. కంపెనీ తప్పుడు దారిలో రూ.19 కోట్ల మేరకు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ను పొందినట్టుగా అధికారులు గుర్తించారు.

అధికారులు అరెస్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డిని ఆర్థిక నేరాల చట్టాలకింద కోర్టులో ప్రవేశపెట్టి జుడిషియల్ రిమాండ్ కు పంపనున్నారని సమాచారం. కంపెనీ ఉద్దేశపూర్వకంగా చేసిన నేరాలకు ఇన్వాయిస్ లే ఆధారమని, గట్టి ఆధారాలు సేకరించిన తర్వాతే జి.ఎస్.టి అధికారులు కంపెనీపై ఆర్థిక నేరాల చట్టాలకింద కేసులు నమోదు చేసి పూర్వ ఎం.డిని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొనుగోళ్లపై పన్ను చెల్లించినట్టైతే అమ్మకాలపై మళ్లీ అదనంగా పన్ను పడకుండా ఇన్ పుట్ టాక్స్ రాయితీని పొందే అవకాశం ఉంటుంది. డాక్టర్ కాపర్స్ బాటిల్స్ ని తయారు చేసే ఈ కంపెనీ విధానాన్ని ఉపయోగించుకుని అనేక రకాలైన అవకతవకలకు పాల్పడిందని అధికారులు చెబుతున్నారు. జి.ఎస్.టి ఎగ్గొట్టేందుకు తప్పుడు బిల్లుల్ని సృష్టించారనీ వాటిద్వారా ఇన్ పుట్ క్రెడిట్ ను పొందారనీ అంటున్నారు.

సి.జి.ఎస్.టి చట్టం 2018 సెక్షన్ 132 ప్రకారం ఇది శిక్షింపదగిన నేరం. సెక్షన్ 69, సి.జి.ఎస్.టి యాక్ట్ ప్రకారం ఈ నేరానికి పాల్పడినవాళ్లను అరెస్ట్ చేసే అధికారం, కేసులు నమోదు చేసే అధికారం జి.ఎస్.టి విజిలెన్స్ అధికారులకు ఉంటుంది.

Next Story