రైతు కూలీకి రూ. 3 కోట్ల జీఎస్టీ బిల్లు : ఇదీ అసలు కథ !
By రాణి Published on 24 Jan 2020 4:41 PM ISTసమ్మక్క ఒక గిరిజన మహిళ. ములుగు మండలంలోని ఏటూరు నాగారంలో రైతు కూలీ ఆమె. ఏదో ఎలాగోలా పొట్టపోసుకుంటుంది. కానీ ఈ మధ్యే ఆమెకు ఒక నోటీసు వచ్చింది. ఏదో ఆషామాషీ నోటీసే కదా అని తెరిచి చూస్తే ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. మూడు కోట్ల రూపాయల జీఎస్ టీ చెల్లించాలని ఆ నోటీసులో వ్రాసి ఉంది. దాంతో ఆమెకు దిక్కు తోచలేదు.
ఆమె అధ్యక్షురాలుగా ఉన్న సహకార సంఘం రూ. 24.5 కోట్ల మేరకు ఇసుక తవ్వకం చేసిందని, అందుకు గానూ రూ. 3.4 కోట్ల పన్ను చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. పైగా రికార్డుల మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఇసుక సేకరించినందుకు గాను ఏటూరు గ్రామ ప్రజల ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు రూ. 24.5 కోట్ల మేరకు చెల్లించింది. దీంతో సమ్మక్క కళ్లు తేలేసింది.
అసలు కథేమిటంటే గిరిజన ప్రాంతాల్లో ఇసుక క్వారీయింగ్ చేయాలంటే తప్పనిసరిగా స్థానిక గిరిజనులే చేయాలి. అందుకు వారు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమ్మక్క ఇతర గిరిజన మహిళలతో కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే మైనింగ్ ను మాత్రం పెద్ద కంపెనీలకు సబ్ లీజ్ కు ఇచ్చింది. ఇందుకు గాను కంపెనీలు వారికి ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున చెల్లించింది. ఈ మొత్తం సంఘం సభ్యుల ఖాతాల్లో జమ అయింది కూడా. అయితే ఇంతింత ఇసుకను మైనింగ్ చేశారని, దాని ధర ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని గిరిజనులకు తెలియదు. వీరికి ఎంతో కొంత చెల్లించి, కంపెనీలు మొత్తం ఇసుకను దండుకున్నాయి.
సమ్మక్క 2016 నుంచి ఈ సంఘానికి అధ్యక్షురాలుగా ఉంటోంది. తాను అయిదు కంపెనీలకు సబ్ లీజ్ ఇచ్చినట్టు చెప్పింది. ఆ తరువాత ఎవరు ఏం చేశారో తనకు తెలియదని ఆమె చెబుతోంది. తాము కొన్ని సమావేశాలకు హాజరయ్యామని, ప్రతి సారి చేతికి రూ. 500 ఇచ్చేవారని ఆమె చెబుతోంది. వారు అడిగిన చోటల్లా సంతకాలు చేశామని ఆమె చెబుతోంది. ఆమె గ్రామం, దాని పొరుగున ఉన్న మరో రెండు గ్రామాల్లో ఆరువందల మంది సభ్యులు సంఘంలో ఉన్నారు. వీరందరికీ రూ. 80000 నుంచి రూ. ఒక లక్ష వరకూ ఐటీడీఏ అధికారులు ముట్టచెప్పారు. కళ్లముందునుంచే టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతున్నా గిరిజనులకు దీని గురించి తెలియదు. తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పొరేషన్ వీరికి లీజుకిచ్చింది. వీరు పెద్ద కంపెనీలకు లీజుకిచ్చారు. ఈ సంఘం ఫిబ్రవరి 16, 2015 న ప్రారంభమైంది. ఇలా అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని కొన్ని కంపెనీలు ఇష్టారాజ్యంగా దోచుకున్నాయి.
ఈ విషయమై ప్రశ్నిస్తే ఐటీడీఏ అధికారులు జీ ఎస్ టీ నోటీసు గురించి తమకేమీ తెలియదని, తమ పని సంఘాలకు అనుమతులివ్వడంతోనే అయిపోతుందని ఐటీడీఏ పీవో వి. చక్రధర్ అన్నారు.