తాళి కట్టే సమయంలో వరుడు అరెస్ట్.. అసలు విషయం తెలిస్తే షాకే..
By సుభాష్ Published on 22 March 2020 12:26 PM ISTపోలీసుల రాకతో పీటల మీదే ఓ పెళ్లి ఆగిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. వరుడు తాళికట్టే సమయంలో ఓ యువతి పోలీసులను తీసుకుని మండపానికి వచ్చింది. పెళ్లి కొడుకు నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
రామగిరి మండలంలోని సెంటీనరీ కాలనీకి చెందిన నాగెల్లి సాంబయ్య, స్వరూపరాణి దంపతులకు పెద్ద కొడుకు అయిన వరుణ్‌కుమార్. ఇతనికి నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం ఉదయం పది గంటలకు సెంటనరీ కాలనీలో వివాహం జరిపించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. పెళ్లి పీటలపై వధువు, వరుడు వచ్చారు.
వేదమంత్రోచ్ఛరణల మధ్య పెళ్లి కార్యక్రమం జరుగుతుండగా, కొన్ని నిమిషాల్లోనే వరుణ తాళి కట్టే సమయం వచ్చేసింది. ఇంతలోనే వరుడు, వధువుతో పాటు పెళ్లివారంతా షాకయ్యే ఘటన చోటు చేసుకుంది. ఇక పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి శనివారమే ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక ముషీరాబాద్ పోలీసులు వెంటనే రామగిరి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సరిగ్గా తాళి కట్టే సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వరుడిని అదుపులోకి తీసుకున్నారు.దీంతో పెళ్లి పీటల మీదే వివాహం ఆగిపోవడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.