పర్యావరణం అమ్మాయి.. భారత్ లో పరీక్షలపై స్పందించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 3:53 PM GMT
పర్యావరణం అమ్మాయి.. భారత్ లో పరీక్షలపై స్పందించింది

నీట్, జేఈఈ ఎంట్రెన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. స్టూడెంట్ల కెరీర్ ను ప్రమాదంలో పడేయలేమని, ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే నీట్ ఎగ్జాం సెప్టెంబర్ 13న, ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం చేపట్టే జేఈఈ ఎగ్జాం సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరగనున్నాయి.

ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ 11 రాష్ట్రాలకు చెందిన 11మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే..! 'విద్యార్థులు మొత్తం ఏడాదిని వేస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? కరోనా ఇంకో ఏడాది కూడా కొనసాగొచ్చు. మరో ఏడాది దాకా వెయిట్ చేయాలని అనుకుంటున్నారా? దేశం, స్టూడెంట్లు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారో మీకు తెలుసా?’ అని పిటిషనర్లను జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రీ జడ్జ్ బెంచ్ ప్రశ్నించింది.

విద్యార్థులు మాత్రం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ కోరుతున్నారు. దీనిపై ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్ బెర్గ్ స్పందించింది. స్వీడన్ దేశానికి చెందిన ఈ టీనేజ్ అమ్మాయి భారత్ లో కోవిద్-19 ప్రబలుతున్న సమయంలో నీట్, జేఈఈ వంటి ప్రవేశపరీక్షలు నిర్వహించడంపై స్పందించింది. నీట్, జేఈఈలను వాయిదా వేయాలంటూ ట్వీట్ చేసింది.

"మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో భారత్ లో విద్యార్థులకు జాతీయస్థాయి పరీక్షలు నిర్వహించడం అన్యాయం. వరదల కారణంగా కోట్లాదిమంది నష్టపోయిన పరిస్థితి ఏర్పడిన సమయంలో నీట్, జేఈఈ వాయిదా వేయాలంటున్న వారికి నేను కూడా మద్దతు పలుకుతున్నాను" అంటూ గ్రేటా థన్ బెర్గ్ ట్వీట్ చేసింది.



కరోనా కారణంగా నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు నేతలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సుప్రీం తీర్పుతో ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ,నీట్‌ లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ఎన్టీఏ అడ్మిట్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో పర్యావరణం పిల్ల చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story