మద్యం ప్రియులకు శుభవార్త.. ఆ రాష్ట్రంలో బార్లకు గ్రీన్ సిగ్నల్

By సుభాష్  Published on  24 Jun 2020 8:01 AM GMT
మద్యం ప్రియులకు శుభవార్త.. ఆ రాష్ట్రంలో బార్లకు గ్రీన్ సిగ్నల్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులతో పాటు బార్లు కూడా మూసివున్నాయి. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల కేంద్రం అనుమతితో మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు ఇవ్వడంతో సోమవారం నుంచి రాజస్థాన్‌లో ప్రభుత్వం బార్లు తిరిగి తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. జూన్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ, బార్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటి వరకూ మూసే ఉన్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం నుంచి రాజస్థాన్‌ రాష్ట్ర వ్యాప్తంగా బార్లు తెరుచుకోనున్నాయి.

నిబంధనలతో బార్లకు అనుమతి

ఇక బార్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. పలు నిబంధనలు విధించింది. సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్‌ చేయడం వంటివి ఖచ్చితంగా పాటించాలని రాజస్థాన్‌ సర్కార్‌ సూచించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ యధావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇక లాక్‌డౌన్‌ నుంచి మాల్స్‌, రెస్టారెంట్లు, తదితర షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. కరోనా భయంతో జనాలు పెద్దగా బయటకు రావడం లేదు. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చినా.. చాలా మంది బయటకు వచ్చేందుకు వెనుకంజ వేస్తుండటం గమనార్హం.

Next Story