ముఖ్యాంశాలు

  • కాటేసిన కరోనా, అకాల వర్షాలు
  • లబోదిబోమంటున్న ద్రాక్ష, మామిడి రైతులు

ఓ వైపు కరోనా వైరస్..మరో వైపు అకాల వర్షాలు రైతన్నను అతలాకుతలం చేస్తున్నాయి. పంటచేతికొచ్చిందనుకుంటున్న సమయంలో సరైన గిట్టుబాటు ధర రాకుండా కరోనా కాటేసింది. ద్రాక్ష, మామిడి పండ్లకు ఇదే సీజన్. అనంతపురంలో సుమారు 300 హెక్టార్లలో పండించిన ద్రాక్షకు గిట్టుబాటు లేకపోవడంతో అవి చెట్లకే కుళ్లిపోయి రాలిపోతున్నాయి. కరోనా పుణ్యమా అని అందివచ్చిన ద్రాక్ష అందకుండానే పోతోంది. కొంతమంది రైతులదే పంటను వదులుకోలేక తోట వద్ద గిట్టుబాటు ధరలో పావు వంతుకు అమ్మెస్తున్నారు. ఇలా వచ్చిన పంటను దళారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతుకు మాత్రం కన్నీరే మిగులుతోంది.

Also Read : కరోనా పేరుతో దళితులపై అమానుషం..

రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న అకాలవర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వేసవి రాగానే మొదట గుర్తొచ్చేది మామిడి. మామిడి తిననిదే వేసవి గడవదు. కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ..అప్పుడప్పుడైనా రైతుమార్కెట్లలో మామిడిని విక్రయించుకోవచ్చని కలలు కంటున్న రైతన్నకు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా పండ్లన్నీ తోటల్లో నేలరాలుతున్నాయి. ఎలాగూ మామిడిని ఎగుమతి చేసేందుకు ఆస్కారం లేదు. ఇప్పుడు ఎలాగొలా స్థానిక రైతు మార్కెట్లలో అమ్మే అవకాశం కూడా లేకుండా పోయింది.

Also Read : క్వారంటైన్ లో పౌష్టికాహారం

కేవలం ద్రాక్ష, మామిడి రైతులే కాదు..వరి పండించిన రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కుప్పలు నూర్చి మూటలు కట్టి ఇక స్థానిక కేంద్రాల్లో అమ్మడే తరువాయి అనుకున్న సమయానికి వచ్చిన అకాల వర్షానికి పదుల సంఖ్యలో వరి బస్తాలు తడిచిపోయాయి. రైతన్నపై ప్రతి ఏటా ప్రకృతి పగబట్టినట్లే ఉంటోంది. అయితే మండే ఎండలు..నీరులేక పంటలు పండవు. అన్నీ బావుంటే అకాల వర్షాలొచ్చి అతలాకుతలం చేసి వెళ్లిపోతాయి. లాక్ డౌన్ ను 14వ తారీఖు తర్వాతనైనా ఎత్తివేస్తే ఎంతో కొంత వరకైనా పంటలను ఎగుమతి చేసుకోవచ్చన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు రైతన్న.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.