అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి అంత్యక్రియలకు వెనుకడుగు.. ముందుకొచ్చిన వాలంటీర్లు

By సుభాష్  Published on  6 May 2020 2:10 PM GMT
అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి అంత్యక్రియలకు వెనుకడుగు.. ముందుకొచ్చిన వాలంటీర్లు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఏ కారణంచేత చనిపోయినా కరోనా ఉందనే భయాందోళన నెలకొంటోంది. సహజ మరణం అయినా అంత్యక్రియలను చేసేందుకు భయపడుతున్నారు. గుంటూరు జిల్లాలో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఓ వ్యక్తికి కరోనా ఉందనే భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం వెనుకడుగు వేశారు. అయితే ఇలాంటి కష్టకాలంలో ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లు ముందుకొచ్చారు. దగ్గరుండి వృద్దుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేటలో చోటు చేసుకుంది.

ఏనుగల బజార్‌కు చెందిన షేక్‌ నన్నే అనే వృద్ధుడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి చనిపోవడంతో వారంతా కూడా నర్సరావుపేటకు వచ్చారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు వెనుకడుగు వేశారు. ముందే ఏనుగల బజార్‌ కరోనా వల్ల రెడ్‌ జోన్‌లో ఉంది. కరోనా భయంతో కుమారులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు భయపడ్డారు. కాగా, ఈ విషయం స్థానిక గ్రామ వాలంటీర్లకు తెలిసింది.

కాగా, వృద్దుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు వాలంటీర్‌లు సైదావలి, జానిబాషా, సయ్యద్‌ జాఫర్‌, ఖాదర్‌లు ముందుకు వచ్చారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి స్నానం చేయించి ప్యాక్‌ చేశారు. ఇక వాలంటీర్లు ధైర్యంతో ముందుకు రావడంతో కుమారులు సైతం భయాన్ని వీడారు. వారు కూడా తండ్రి అంత్యక్రియాల్లో వెనుకడుగు వేయకుండా పాల్గొన్నారు. ముస్లిం సంప్రదాయ పద్దతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు.

వాలంటీర్లకు అభినందనలు:

ఎలాంటి భయం లేకుండా అంత్యక్రియలకు ముందుకొచ్చిన వాలంటీర్లను స్థానికులు అభినందించారు. వృద్దుడు అనారోగ్యం కారణంగా మరణించాడని, సహజమరణం అయినందున మృతదేహానికి ఎలాంటి వైద్య పరీక్షుల అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంతవాళ్లే ముందుకు రాకున్నా.. ఎలాంటి సంబంధం లేని వాలంటీర్లు భయపడకుండా మానవత్వంతో ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు. ఇలాంటి వారు ప్రతీ వార్డులో ఉండాలంటూ కోరుతున్నారు.

Next Story
Share it