భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటన
By అంజి Published on 10 Dec 2019 1:21 PM ISTముఖ్యాంశాలు
- గవర్నర్ తమిళసైకి గిరిజన సంప్రదాయంలో ఘనస్వాగతం
- గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్న గవర్నర్
వరంగల్ అర్బన్: రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును గవర్నర్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. అనంతరం గవర్నర్ తమిళసై కాటరం మండలం బోడగూడెం గ్రామానికి వెళ్లారు. గవర్నర్ తమిళసైకి గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. బోడగూడెంలోని గిరిజనులతో గవర్నర్ తమిళసై మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సమస్యలను, వారి జీవన స్థితిగతులను గవర్నర్ అడిగి తెలసుకున్నారు. అక్కడే మొక్కలను నాటారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.
గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు బ్యాగ్‌లు డ్రెస్‌లు పంపిణీ చేశారు. తమిళసై మాట్లాడుతూ.. గవర్నర్ హోదాలో రాలేదు.. మీ అక్కగా వచ్చానన్నారు. నిర్వాసితులకు భూమి, డబుల్ బెడ్రూమ్ అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలు గిరిజన ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తానని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు. స్థానిక గిరిజన గ్రామ దేవత లక్ష్మీ దేవర అమ్మవారిని గవర్నర్ తమిళ సై దర్శించుకున్నారు. గవర్నర్ తమిళసైతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు ఉన్నారు.
కాగా నిన్న హన్మకొండలోని రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా బాధితుల అదనపు బ్లాక్ కార్యాలయానికి తమిళసై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ తలసేమియా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. తలసేమియా వ్యాధిని రాష్ట్రం ప్రభుత్వం ఆరోగ్య శ్రీలో చేర్చడంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళసై కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని వేయిస్థంభాల గుడి, ఓరుగల్లు శ్రీభద్రకాళీ దేవాలయంలో తమిళసై దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం చారిత్రాత్మక పర్యటక ప్రాంతమైన ఖిలా వరంగల్ కోటను గవర్నర్ తమిళ సై సందర్శించారు.