కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం దృష్టి
By Newsmeter.Network Published on 8 April 2020 8:13 AM ISTప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలోనూ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్ భారిన పడి వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. పలువురు మృతి చెందారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఇప్పటికే కాంటాక్ట్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రభుత్వం వాటిపై ప్రత్యేక నిఘా ఉంచింది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాల పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాపించిన ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తిస్తున్న ప్రభుత్వం అక్కడివారందరికీ టెస్టులు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read :అమెరికాలో మృత్యు మృదంగం.. భారత్‌లో 5 వేలకు చేరువలో కేసులు
ఈ నెల 14వరకే ఈ టెస్టుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో అనుమానితులందరికీ వేగంగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుంది. వైరస్ నిర్దారణ జరిగితే వారిని మిగతా వారితో విడదీయటం, చికిత్స అందించటం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో వేగంగా వైరస్‌ను నిర్ధారించే రాపిడ్ కరోనా టెస్టులను అందుబాటులోకి తేబోతోంది. ఈ విధానంలో 5 నిమిషాల్లో ఫలితం వచ్చే వీలుంటుంది. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వాళ్లు 1029 మంది ఉన్నట్లు రాష్ట్రం గుర్తించగా, వారిలో 170 మందికి మాత్రమే వైరస్ సోకింది. వీరి ద్వారా రాష్ట్రంలో మరో 100 మందికిపైగా వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వీరిలో అధిక శాతం కుటుంబ సభ్యులు, ఇతరులకూ ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తిస్తున్నారు. వీరిద్వారా మరిన్ని కాంటాక్ట్ కేసులు పెరగకుండా నిర్ధారణ పరీక్షలు వేగంగా పూర్తిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోదించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.