రషీద్ ఖాన్.. అనుష్క శర్మ.. గూగుల్ తప్పేమిటో..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2020 7:11 PM ISTరషీద్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే..! అందుకు కారణం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వచ్చిన పొరపాటే. ఆఫ్ఘానిస్తాన్ ఆటగాడైన రషీద్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. రషీద్ ఖాన్ కు ఇంకా పెళ్లి అవ్వలేదు. కానీ గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తుంటే మాత్రం అనుష్క శర్మ అని చెబుతోంది. క్రికెట్ ప్రేమికులు ఈ సెర్చ్ రిజల్ట్ చూసి షాక్ అవుతూ ఉన్నారు.
22 ఏళ్ల రషీద్ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అంటే కోహ్లీ సతీమణి పేరు ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. రషీద్ ఖాన్ 2018లో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. రషీద్ ఖాన్ ఫేవరెట్ 'అనుష్క శర్మ' అని వార్తలు వచ్చాయి. కానీ గూగుల్ సెర్చ్ లో మాత్రం రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అని చూపిస్తోంది.
రషీద్ ఖాన్ పెళ్లి విషయంలో ఓ కండీషన్ పెట్టుకున్నానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అదేమిటంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రపంచకప్ గెలవాలట. క్రికెట్ ప్రపంచ కప్ గెలిస్తే ప్రపంచ దేశాల దృష్టి తమ దేశం వైపు పడుతుందని, దాని వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని చెబుతూ ఉన్నాడు.
అందుకే ప్రపంచకప్ గెలిచే వరకు పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. ఆఫ్ఘన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ లో అప్పుడప్పుడు పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇస్తూ ఉంది. కానీ ప్రపంచకప్ లాంటి టోర్నీని గెలవడానికి ఎన్నో విషయాల్లో మెరుగవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పట్లో ప్రపంచకప్ గెలిచేనా.. రషీద్ ఖాన్ కు పెళ్లి అయ్యేనా అని కూడా కౌంటర్లు వినిపించాయి.