ఐపీఎల్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2020 9:09 AM ISTఐపీఎల్.. మ్యాచ్ కు ముందే భారీ అంచనాలు.. హౌస్ ఫుల్ గ్రౌండ్ లు.. అద్భుతమైన ఇన్నింగ్స్ లు.. వీరాధివీరులైన ఆటగాళ్లు.. ఎన్నో దేశాలు క్రికెట్ లీగ్ లను మొదలుపెట్టినా ఐపీఎల్ కు మాత్రమే అంత గొప్ప ఆదరణ లభించిందంటే మన గొప్పతనం అలాంటిది. ఈ ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే..!
మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. ఆగష్టు 2వ తేదీన పూర్తి స్థాయి ఐపీఎల్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సీజన్ లో అభిమానులు స్టేడియం లోకి అనుమతి లేదనే వార్తలు వచ్చాయి. తీరా చూస్తే స్టేడియం లోకి క్రికెట్ అభిమానులు వెళ్లేందుకు యుఏఈ ప్రభుత్వం అనుమతిని ఇస్తే తప్పకుండా అభిమానులు డైరెక్ట్ గా మ్యాచ్ చూసే అవకాశం ఉందట..!
యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే అభిమానులకు ప్రవేశం కల్పిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఇప్పటికే వెల్లడించాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని కూడా తాము క్రికెట్ అభిమానులను స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పూర్తి స్టాండర్డ్ అపరేటివ్ ప్రొసీజర్స్‌తో యుఏఈ ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆయన అంటున్నారు. 30-50 శాతం సామర్థ్యం సీటింగ్ కెపాసిటీ ఉండేలా చూసుకోనున్నారు. ఈ ప్రతిపాదనకు యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే బాగున్ను అని క్రికెట్ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.
ఆటగాళ్లకు కూడా కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. టోర్నీ జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా బీసీసీఐ యుఎఈ బోర్డుకు లెటర్ రాసింది. అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. యుఏఈలో మొత్తం మూడు స్టేడియంలు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియం, షేక్ జాయద్ స్టేడియం(అబుదాబి), షార్జా గ్రౌండ్ లు అందుబాటులో ఉన్నాయి. ఐసీసీ అకాడెమీకి చెందిన గ్రౌండ్ లను బీసీసీఐ అద్దెకు తీసుకోనుంది. అందులో ఫ్రాంచైజీలకు చెందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేయనున్నారు.