విద్యార్థుల విషయంలో ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్..!

By సుభాష్  Published on  15 July 2020 5:34 AM GMT
విద్యార్థుల విషయంలో ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్..!

ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ కొద్దిరోజుల కిందట ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థులే కాకుండా యూనివర్సిటీలు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. తమ నిర్ణయం తప్పని గుర్తించిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.

విదేశాల నుండి వచ్చి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరికైతే ఆన్ లైన్ క్లాసులు కేటాయించారో వారు అమెరికాను వీడాల్సిందేనని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ జులై 6న ప్రకటన విడుదల చేసింది. నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్-1, ఎం-1 విద్యార్థులు, స్కూళ్లకు తప్పనిసరిగా హాజరుకావాలని.. ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు వెళ్లిపోవాలని ఐసీఈ ఆదేశించింది. నిబంధనలను పాటించని విద్యార్థులు, తమ స్వదేశాలకు తిరిగి వెళ్లకుంటే, వారిపై చట్టపరమైన ఇమిగ్రేషన్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. పూర్తి ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్న స్కూళ్లలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారిని ఎవరినీ దేశంలో ఉంచబోమని.. ఈ తరహా వీసాలను తీసుకున్న వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం దేశంలోకి అనుమతించదని తెలిపారు.

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యూఎస్ లోని పలు యూనివర్శిటీలు, టెక్నాలజీ దిగ్గజాలు దీన్ని తప్పుబట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ హార్వర్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఇతర సంస్థలతో కలిసి కోర్టును ఆశ్రయించాయి. జులై 6న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు యూఎస్ లో విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ అనుమతితో అక్కడ చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి విద్యా సంస్థలు భావించాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా అడ్మిషన్లు పెద్దగా లేవని అంటున్నారు.

Next Story