ఆన్ లైన్ లో అక్షయ తృతీయ
By రాణి Published on 19 April 2020 11:56 PM ISTఅక్షయ తృతీయ..ఈ రోజున బంగారం కొంటే ఆ ఏడాదంతా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని, సాక్షాత్తు లక్ష్మీదేవే ఇంటికొచ్చినట్లు భావిస్తారు చాలామంది. అక్షయ తృతీయతిధి నాడు బంగారం ధర ఎంతున్నా సరే కనీసం తులం బంగారమైనా కొంటే కలిసొస్తుందని భారతీయుల విశ్వాసం. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 26న వచ్చింది. లాక్ డౌన్ గడువు మే 3వ తేదీ వరకూ ఉంది. ఆ తర్వాతైనా లాక్ డౌన్ ను సడలిస్తారో లేదో స్పష్టత లేదు. సరే..ఆ విషయాన్ని పక్కనపెడితే లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో అక్షయ తృతీయ నాడు షాపుకెళ్లి బంగారం కొనడం కల్లో మాటే.
Also Read : కరోనా కేక్ ను నరికిన మంత్రి
లాక్ డౌన్ ఉన్నప్పటికీ అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు జరపాలని నిర్ణయించిన ప్రముఖ బంగారం దుకాణ సంస్థలు తనిష్క్, కల్యాణ్ జ్యూయలర్స్ ఆన్ లైన్ లో గోల్డ్ అమ్మకాలు చేస్తున్నట్లు ప్రకటించాయి. టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్ జ్యూయలరీ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు కస్టమర్లు తమ వెబ్ సైట్ లో బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ మేరకు తమ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ ఛాటింగ్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ కస్టమర్లలో 54 శాతం మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అందుకే ఆన్ లైన్ కొనుగోళ్లు ప్రారంభించినట్లు తనిష్క్ పేర్కొంది. లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువును డెలివరీ ఇస్తామని, లేదా దగ్గర్లోని తనిష్క్ షో రూమ్ లో కొనుగోలు చేసిన వస్తువు తాలూకా వివరాలు చూపించి పొందవచ్చని తెలిపింది.
Also Read : మాకు సమోసాలు, పిజ్జాలు కావాలి.. దేశ రాజధానిలో వింత కోరికలు