203జీవో అమలైతే శ్రీశైలం ఖాళీ అవుతుంది - కోదండరాం
By Newsmeter.Network
ఏపీలోని జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 203 అమలైతే శ్రీశైలం ఖాళీ అవుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఏపీ తెచ్చిన జీవోను నిరసిస్తూ జలసౌధలో ఇంజనీర్ ఇన్ చీప్ మురళీధర్‌రావును కోదండరామ్, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా నది జలాల పరిరక్షణ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్‌రావుకు వివరించామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203జీవో అమలైతే శ్రీశైలం ఖాళీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 203 వెనుక తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఉందేమోనని అనుమానం కలుగుతోందని, జీవో 203 ఉపసంహరణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. లేకుంటే 1990 కల్వకుర్తి కోసం జరిగిన తరహాలో పోరాటం చేస్తామని కోదండరాం హెచ్చరించారు.
Also Read :ఏపీలో కిలో చికెన్ ధర రూ.310..!
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తిచేయాలని కోరారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులు తీసుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే 80వేల క్యూసెక్కుల నీటి తరలింపు జీవో 203 ఉపసంహరణకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిధ్దం కావాలని డిమాండ్ చేశారు.